2018 తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆరెస్స్ కు ఒక వ్యక్తి వరంలా దొరికాడు. కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతీ నియోజకవర్గంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు. ఆయనే చంద్రబాబు.
అవును… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దోస్తీ కట్టారు. తెలంగాణలో కనుమరుగైపోతున్న టీడీపీకి ఆ దోస్తానా వల్ల మేలు జరుగుతుందని భావించారు. దీంతో… తెలంగాణ జరిగే కాంగ్రెస్ సభల్లో వేదికపై కాంగ్రెస్ నేతలతో కలిసి చేతులు పైకెత్తేవారు. దాన్ని కేసీఆర్ ఫుల్ గా క్యాష్ చేసుకున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది చంద్రబాబుకు వేసినట్లే.. ఆంధ్రా పెత్తనం అవసరమా అని ఫైరయ్యారు. ఫలితం తెలిసిందే!
దాదాపు అలాంటి సన్నివేశమే ఈ దఫా ఎన్నికల్లో కూడా కేసీఆర్ కు వరంలా మారే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అవును… తెలంగాణ బీజేపీకి కిషన్ రెడ్డి కొత్త చీఫ్ అయిన తర్వాత ఈ వ్యవహారం జరగడం గమనార్హం. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటలు గడవకముందే కిషన్ రెడ్డి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రాకపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అయితే ఏకంగా సభ నుంచి వాకౌంట్ చేశారు. అనంతరం ఎందుకు ఈ వాకౌట్ అనేది ట్విట్టర్ లో తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఒకప్పుడు చెప్పిన వ్యక్తితో వేదిక పంచుకోవడం తనకు అసౌకర్యంగా ఉందని, అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
దీంతో పేరు చెప్పకుండానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి విజయశాంతి స్పందించారనే కామెంట్లు వినిపించాయి. ఇదే సమయంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర ఇన్ చార్జ్ లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ లు హాజరైన అల్పాహార సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పలువురు తెలంగాణ బీజేపీ నేతలు.. కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంలో కిషన్ రెడ్డి ఉద్దేశమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి వంటి ఆంధ్రా నాయకుడు ఉండటం వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు బీజేపీ జాతీయ నేతలకు చెప్పారు! అనంతరం ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని, తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ నేతలు జోక్యం చేసుకోవద్దని అధిష్టానాన్ని కోరారని తెలుస్తుంది.
ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా.. తాము భారత రాష్ట్ర సమితికి ఆయుధాన్ని ఇచ్చాము.. బీఆరెస్స్ నేతలు దీన్ని కచ్చితంగా తమకు అనుకూలంగా మలచుకుని తెలంగాణ పట్ల తమ నిబద్ధతను ప్రశ్నిస్తారు అని తెలంగాణ బీజేపీ నేతలు వాపోతున్నారని అంటున్నారు.
దీంతో… గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి, బీఆరెస్స్ గెలుపుకు పరోక్షంగా చంద్రబాబు కారణం అయ్యారని.. ఈసారి బీజేపీ ఓటమికి, ఫలితంగా మిగిలిన పార్టీల గెలుపుకు కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగపడేలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా… తెలంగాణ బీజేపీ నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఒక చంద్రబాబు దొరికారని కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు.