మనం చెప్పే వాటికీ చేసే వాటికి ఎంతో కొంతైనా పొంతన ఉండాలని చెబుతుంటారు పెద్దలు. ఇందులో భాగంగా… తాజాగా లోకేష్ చెబుతున్న ఒక విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు ఒకే ఒక్క ప్రశ్నతో వ్యవహారం మొత్తనికి గాలి తీసేస్తున్నారు.
అవును… ప్రస్తుతం యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న లోకేష్… నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ జిల్లాలోని స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపైనా, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు.
తన పాదయాత్రలో భాగంగా 150వ రోజు, 2 వేల కిలోమీటర్లు మైలురాయిని కావలిలో పూర్తిచేసుకున్న లోకేష్… యువగళం మీ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక అని తెలిపారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… “సక్సెస్ కి షార్ట్ కట్ లేదు.. యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు” అని అన్నారు. దీంతో ఈ విషయంపై ఆన్ లైన్ లో లోకేష్ కు ఒక ప్రశ్న సంధిస్తున్నారు నెటిజన్లు.
నిజంగా సక్సెస్ కి షార్ట్ కట్ ఉండదన్నది నిజమే అయితే.. ఆ విషయం లోకేష్ నమ్మినట్లయితే.. ఎమ్మెల్యే అవ్వకుండానే, వార్డ్ మెంబర్ గా గెలవకుండానే మంత్రి ఎలా అయ్యారు.. అది షార్ట్ కట్ లో కాదా అని ప్రశ్నిస్తూ.. గతాన్ని గుర్తు చేస్తున్నారు. కొన్ని నీతి సూక్తులుల్చెప్పేటందుకే పనికొస్తాయని.. ఆచరించడానికి కాదని కామెంట్లు పెడుతున్నారు. దీంతో… ఈ విషయం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా… 2014 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో షార్ట్ కట్ లో నారా లోకేష్ మంత్రి అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆల్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే!
దీంతో… షార్ట్ కట్ లో వచ్చే సక్సెస్ తర్వాత వచ్చే రిజల్ట్ ఇలానే ఉంటుందని లోకేష్ పరోక్షంగా యువతకు గుర్తుచేస్తున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు!