జనసేన కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరని గతంలో ప్రచారం జరిగింది. నాగబాబు కూడా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంకోసారి పోటీ చేసే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు కూడా.! కానీ, ఈక్వేషన్స్ మారుతున్నాయి.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారట. ఈ విషయమై ఇప్పటికే టీడీపీతో చర్చలు జరిగాయట కూడా.! మరి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంగతేంటి.? అంటే, ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యే రామానాయుడిని ఒప్పించే బాధ్యతని నందమూరి బాలకృష్ణ తీసుకున్నారట.
2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇది ‘మెగా కాంపౌండ్’కి సొంత నియోజకవర్గం లాంటిది. కానీ, చిరంజీవి గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తరఫున భీమవరం నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు.
భీమవరం – పాలకొల్లు.. పక్కపక్కనే వుండే నియోజకవర్గాలు. అయితే, గతంలో జరిగిన ఎన్నికలకీ, ఇప్పుడు జరగబోయే ఎన్నికలకీ చాలా తేడా వుందనీ, ఈసారి గెలుపు పక్కా అనీ జనసేన వర్గాలు అంటున్నాయి.
ఒకవేళ నాగబాబు గనుక, పాలకొల్లు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తే, జనసేనాని పవన్ కళ్యాణ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడి నుంచీ పోటీ చేయకపోవచ్చు. గాజువాక పైనే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారనీ, అందుకే నాగబాబుని పాలకొల్లులో పోటీ చేయమని పవన్ చెబుతున్నారనీ అనుకోవచ్చు.
పాలకొల్లుకంటే కూడా భీమవరం అడ్వాంటేజ్ అవుతుంది నాగబాబుకి. అయితే, భీమవరం వచ్చే ఎన్నికల్లో అత్యంత ఖరీదైన నియోజకవర్గం కాబోతోంది. అందుకే, నాగబాబు స్వయంగా పాలకొల్లుని ఎంచుకున్నారనే వాదనా లేకపోలేదు.