చంద్రబాబు మరో కేసీఆర్ అవుతారనే ఎవరూ ఆయనకు సహకరించడం లేదు 

చంద్రబాబు మరో కేసీఆర్ అవుతారనే ఎవరూ ఆయనకు సహకరించడం లేదు
ప్రజా ఉద్యమాల ద్వారా రాజకీయ లబ్దిని పొందే సంస్కృతి బాగా ఎక్కువైంది.  ఎందుకంటే ప్రజా ఉద్యమాల ఫలితాలు చూపే ప్రభావం అంత గొప్పగా ఉంటుంది మరి.  దేశ, రాష్ట్ర చరిత్రల్లో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను గురించి ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటుంటారు.  వాటి గురించి వింటే తెలియని వారికి కూడ ఒకరకమైన పులకరింపు పుడుతుంది.  అందుకే ప్రజా ఉద్యమాల క్రెడిట్ ఖాతాలో వేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.  ఆ ప్రయత్నాల్లో సఫలమయ్యేవారు అతికొద్దిమందే ఉంటారు.  అలాంటి వారిలో కేసీఆర్ ఒకరు.  తెలంగాణ ఉద్యమం సాఫల్యం కావడానికి కేసీఆరే కారణమంటే అది పొరపాటే.  ఆయన కూడా ఒక కారణం అనేది కరెక్ట్ మాట.  విద్యార్థులు, కూలీలు, రైతులు, ఇతర వృత్తులవారు, విద్యావంతులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు సమిష్టిగా పోరాడితేనే తెలంగాణ సాకరమైంది.  ఎన్నో బలిదానాలు, ఇతర త్యాగాల ఫలితమే తెలంగాణ.  
చంద్రబాబు మరో కేసీఆర్ అవుతారనే ఎవరూ ఆయనకు సహకరించడం లేదు
 
కానీ ఇప్పుడా పేరు ప్రతిష్టల్ని సోలోగా అనుభవిస్తున్నది మాత్రం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మరియు తెరాస పార్టీ.  ఉదాహరణకు కేసీఆర్ తో సమానంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్.  కానీ ఇవాళ కేసీఆర్ పొందగలిగిన స్థాయిలో, పేరులో ఒకటవ వంతు కూడా ప్రొఫెసర్ పొందలేకపోయారు.  అదే మరి రాజకీయమంటే.  ఇవన్నీ ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీలకు తెలియవా అంటే తెలుసు.  వారు కూడా అంతా కేసీఆర్ ఒక్కరే జేబులో వేసుకున్నారని అనుకుంటుంటారు.  అయినా కేసీఆర్ జమానా అలా నడిచిపోతుందంతే.  కానీ ఈ ఉదంతంతో ఏపీలోని రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద పాఠమే నేర్చుకున్నాయి.  ఆ పాఠమే విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పి తెచ్చి పెట్టింది.  ఆయన ఆశయాలకు, ఆశలకు గండి కొట్టింది.  
 
ఓటమి తర్వాత జగన్ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి చంద్రబాబుకు చాన్నాళ్ల వరకు అవకాశం దొరకలేదు.  కానీ ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులు, వికేంద్రీకరణ అన్నారో అప్పుడు బాబుగారిలో ఊపు వచ్చింది.  రాజధానిని అమరావతి నుండి తరలిస్తే వేల ఎకరాల భూములిచ్చిన వేలాదిమంది రైతులు నష్టపోతారని బాబు ఎదురుతిరిగారు.  అదే సమయానికి అమరావతి రైతులు కూడా భూములిచ్చిన మా సంగతేమిటని ఉద్యమం మొదలుపెట్టారు.  రోడ్ల మీదికి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నారు.  ఆ ఊపులో రైతుల పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు అనుకున్నారు.  పోరాటానికి అన్ని సామాజిక, రాజకీయ వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.  ఆ పిలుపుకి పార్టీలన్నీ సై అన్నాయి కానీ కదనరంగంలోకి అడుగుపెట్టలేదు.
 
కారణం.. ఈ ఉద్యమాన్ని చంద్రబాబు తన ఉద్యమంగా మలుచుకునే ఆలోచనలో ఉన్నారని.  అప్పుడే వారికి కేసీఆర్ గుర్తొచ్చారు.  ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, టీజెఎస్, వామపక్షాలు, బీజేపీల పరిస్థితి రాష్ట్రం ఏర్పడ్డాక ఏమైందో కళ్ల ముందు కనిపించింది.  రేపు ఉద్యమం పెద్దదైతే బాబుగారు ముందు నిలబడి తమను పాతాళానికి విసిరేస్తారని వాళ్లు పసిగట్టేశారు.  నిజానికి బాబు మనసులో ఉన్న పథకం కూడ అదే.  తమ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి అది సఫలమైతే అందరినీ సైడ్ చేసి దాన్ని తన ఉద్యమంగా, తన విజయంగా చలామణీ చేయాలని అనుకున్నారు.  అందుకే జనసేన, కాంగ్రేస్, బీజేపీ, వామపక్షాలు దూరంగా నిలబడి మా సపోర్ట్ మీకే అంటున్నాయి తప్ప చేయి చేయి కలిపి పోరాటానికి దిగడం లేదు.  
 
కరివేపాకు రాజకీయాలు చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య.  వాడుకుని పక్కపడేయడంలో ఆయన దిట్ట.  అందుకే ఇతర పార్టీలన్నీ కష్టపడి ఉద్యమాన్ని నడిపితే, ప్రభుత్వం మెడలు వంచి అమరావతినే ఏకైక రాజధానిగా నిలిపే అది చివరికి తెలుగుదేశం, చంద్రబాబుల ఖాతాలోకి వెళ్లిపోతుంది.  అప్పుడు మన పరిస్థితి కూడా తెలంగాణలోని ఇతర పార్టీల మాదిరిగానే అడుగు బొడుగు అన్నట్టు తయారవుతుంది.  అది తథ్యం.  అంతమాత్రం దానికి ఉద్యమంలోకి దిగి కష్టపడాల్సిన అవసరం మాకేంటి అనుకుని బాబుగారితో చేతులు కలపడానికి, చంద్రబాబును మరో కేసీఆర్ ను చేయడానికి ఎవ్వరూ సహకరించడం లేదు.  ఫలితంగా 250 రోజులు గడిచినా రైతుల ఉద్యమం ప్రజా ఉద్యమంగా పరిణామం చెందలేకపోయింది.