కొత్త స్లోగన్… “నిజం గెలవాలి” కాదు.. “నిజం చెప్పాలి”!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు విడిచారని.. వారి కుటుంబాలను ఓదార్చాలని తాము అనుకుంటున్నామని.. ఆ కార్యక్రమానికి “న్యాయం గెలవాలి” అని నామకరణం చేసి బస్సు యాత్ర ప్రారంభించారు నారా భువనేశ్వరి. ఇందులో భాగంగా… తన భర్తను అన్యాయంగా జైలులో పెట్టారని అంటూనే రాష్ట్రంలో అరాచక పాలన ఉందని మండిపడ్డారు. నిజం గెలవాలంటే మనం అందరం చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో… చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర ఎంతో సంతోషంగా ఉండేదని, జగన్ పాలనలో అరాచకాలు తప్ప ఇంకేమీ కనిపించడంలేదని భువనేశ్వరి విమర్శించారు. అదేవిధంగా… మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ రాష్ట్రాన్నే కాకుండా న్యాయాన్ని నిర్భంధించిందని ఫైరయ్యారు. ఇదే సమయంలో… ఓదార్పు యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను కలసిన భువనేశ్వరి వారికి రూ.3లక్షల చెక్కును అందించారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబును నిర్భంధిస్తే, మెంటల్ గా డిస్ట్రబ్ అవుతారని వైసీపీ భావిస్తోందని, చంద్రబాబు చాలా బలమైన వ్యక్తి అని, ఆయనకు ఏమీ కాదని, జైలు నుంచి బయటకు వస్తారని, అధికారం కూడా చేపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పూర్తితోనే చంద్రబాబు పాలన చేశారని భువనేశ్వరి చెప్పడం గమనార్హం.

ఇలా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ఇందులో భాగంగా… భువనేశ్వరికి నిజం గెలవాలి అని కాదు.. నిజం చెప్పాలి తల్లి అని సూచించారు మంత్రి జోగి రమేష్. ఇదే సమయంలో… చంద్రబాబు అసలు స్వరూపంపై భువనేశ్వరి నిజం చెప్పాలి.. 2 ఎకరాల నుంచి రెండు వేల కోట్లగతులు అన్నీ భువనేశ్వరి నిజం చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనంతరం… ఈ రోజుకు అయినా నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని చెప్పిన జోగి రమేష్… నిజం గెలవాలి యాత్ర కాకుండా పాపపు పరిహార యాత్ర చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసే విధంగా యాత్ర చేయాల్సిందని సూచించారు. ఇదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తులపై మరింత ఘాటుగా స్పందించారు జోగి రమేష్‌.

ఇందులో భాగమా… పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని నిప్పులు చెరిగిన జోగి రమేష్… ఒకపక్క బీజేపీతో సంసారం చేస్తున్నాను అంటాడు.. మరోపక్క టీడీపీతో కలిసి వెళ్తానని చెబుతుంటాడని దుయ్యబట్టారు. అనంతరం… చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అమ్ముడు పోయాడని ఆరోపించిన ఆయన.. తన అభిమానులను కూడా అమ్మేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి!