హైకోర్టు లోని కొందరు న్యాయమూర్తులు, సుప్రీమ్ కోర్టులోని ఒక సీనియర్ న్యాయమూర్తిలపై నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాసి దాదాపు రెండు మాసాలు అవుతోంది. ఆ లేఖపై ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి చర్య తీసుకున్నారో తెలియదు. త్వరలో ప్రధాన న్యాయమూర్తి కాబోయే ఆ సీనియర్ న్యాయమూర్తిపై విచారణ జరిపిస్తారా లేక ఇగ్నోర్ చేస్తారా అనే అంశం ఉత్కంఠ కలిగిస్తున్నది. జగహమోహన్ రెడ్డి ఆ విధంగా న్యాయమూర్తులనే నిందితులుగా చేస్తూ లేఖ వ్రాయడాన్ని సంచలనంగా వర్ణించవచ్చు. గతంలో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు అలా లేఖలు వ్రాసినా అవి ఇప్పటి జగన్ రాసిన లేఖ అంతటి తీవ్రమైనవి కావు.
అయితే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా లేఖ వ్రాయడాన్ని కొందరు తప్పు పట్టగా, మరికొందరు సమర్ధించారు. న్యాయవ్యవస్థ కూడా మిగిలిన వ్యవస్థల్లాంటివే అని, న్యాయమూర్తులు అవినీతికి అతీతులు కారని, వారిమీద కూడా విచారణలు జరిపించవచ్చని సోదాహరణంగా వివరించారు. ఇక ఆ లేఖ వివరాలను బయటపెట్టడం ఏదో భయంకరమైన నేరం అయినట్లు జగన్మోహన్ రెడ్డిని పదవినుంచి తొలగించాలని సుప్రీమ్ కోర్టులో పిటీషన్లు వెయ్యడం వారి అజ్ఞానానికి, దిగజారుడుతనానికి నిదర్శనం. అయితే సుప్రీమ్ కోర్ట్ ఈ పిటీషన్ మీద తీవ్రంగా స్పందించి ఆ పిటీషన్ ను కొట్టేయడం జగన్మోహన్ రెడ్డికి నైతిక విజయంగా చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన తరువాత ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం పట్ల హైకోర్టు వైఖరిలో కొన్ని చెప్పుకోదగిన మార్పులు కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా జగన్ కు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి పిటీషన్ పై తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసిన హైకోర్టు ఈ మధ్య కాలంలో సానుకూలవ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.
వాటిలో రమేష్ ఆసుపత్రి యజమాని పోతినేని రమేష్ బాబుపై విచారణకు అనుమతిస్తూ అందుకు మూడు రోజులు గడువు ఇవ్వడం ప్రధానమైనది. మొదట్లో అసలు రమేష్ బాబు ను ప్రశ్నించడానికే వీలు లేదని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు సదరు ఆదేశాలను సవరించుకోవడం విశేషమైన పరిణామం. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగుల ఖర్చు విషయంలో కూడా పిటీషనర్ ను హైకోర్టు తప్పు పట్టింది. నాలువేల కోట్ల రూపాయలు అయ్యాయనడానికి ఆధారాలేమున్నాయని ప్రశ్నించింది. గతంలో ఇదే అంశం మీద ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మీద వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం ఇప్పుడు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చడం పట్ల అభ్యంతరం తెలపడం కచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయమే. అలాగే మూడు రాజధానుల విషయం లో కూడా “అసెంబ్లీ కి ఆ అధికారం లేదని ఎలా అంటున్నారు?” అని పిటిషనర్ ను నిలదియ్యడం ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశంగానే చెప్పుకోవాలి.
సుప్రీమ్ కోర్ట్ కూడా జగన్ ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో ఊరట కలిగించే ఆదేశాలు ఇస్తున్నది. ముఖ్యంగా దమ్మాలపాటి శ్రీనివాస్ మరియు ఇతర నిందితులకు నోటీసులు ఇవ్వడం, హై కోర్ట్ ఇచ్చిన గాగ్ ఆర్డర్ ను పక్కన పెట్టడం, ఆ కేసును జనవరి నెలాఖరు వరకు ఫైనల్ చెయ్యద్దని ఆదేశాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైన అంశాలే. అలాగే జగన్ ను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించాలనే పిటీషన్లను కొట్టెయ్యడం జగన్ విజయాలే.
ఏమైనప్పటికీ, జగన్మోహన్ రెడ్డి పడిన కష్టం, అపనిందలను మరపించేవిధంగా ఇటీవల న్యాయ వ్యవస్థలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఒకరికొకరు సహకరించుకుంటూ పని చేస్తే రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.