ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయంగా అధిక ప్రాధాన్యం సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో ప్రభుత్వం రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు కూడా రాజకీయ రంగు పులుముకుంటుంటాయి. ఈ సయంలో తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కన్నాకు షాకిచ్చిందని అంటున్నారు.
అవును… ఉమ్మడి గుంటూర్ జిల్లా పల్నాడులోని సత్తెనపల్లి నియోజకవర్గం గతకొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పైగా… తమను కాదని బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడంపై కోడెల శివరాం ఫైరవుతున్నారు. ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే… మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న గన్ మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజులుగా కన్నా ఇంటికి గన్ మెన్లు రావడం లేదు. తీరా ఆరా తీస్తే… ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు తాము విధులకు రావడం లేదని చెప్పినట్లు సమాచారం.
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణకు ఐదేళ్ల క్రితమే గన్ మెన్ల భద్రతను కల్పించారు. అప్పట్లో నెలకొన్న పరిస్ధితులతో ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు గన్ మెన్లను ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఈ భద్రత కొనసాగింది. అయితే కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం, ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా కన్నా భద్రత కొనసాగింది.
అయితే తాజాగా ప్రభుత్వం హోంశాఖ తరఫున నిర్వహించిన సమీక్షా సమావేశంలో… కన్నాకు భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఉన్నఫలంగా తనకు భద్రత ఎందుకు తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇదే సమయంలో ఇదంతా మంత్రి అంబటి రాంబాబు చేసిన పనే అని ఫైరవుతున్నారంట.
అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మంత్రి కాదు, బీజేపీ అధ్యక్షుడూ కాదు, టీడీపీ పార్టీకి చెందిన ఒక అసెంబ్లీ ఇన్ ఛార్జ్. ఆయన బీజేపీ చీఫ్ గా పదవి పోయినప్పుడే గన్ మెన్ లను తొలగించాల్సింది. అయితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అని అంబటి వర్గం వాదిస్తోందని అంటున్నారు. అయితే దీన్ని రాజకీయం చేసేందుకు కన్నా వర్గీయులు పథకాలు రచిస్తున్నారని అంటున్నారు.
అయితే ఇప్పటివరకూ పార్టీని కాపాడిన సొంత టీడీపీ నేతలను కాదని… సత్తెనపల్లిలో బీజేపీ నుంచి వచ్చిన కన్నాను టీడీపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు బాబు. నాటి నుంచి నియోజకవర్గంలో కన్నా కదలికలు పెరిగాయని అంటున్నారు. దీంతో ఇలా గన్ మెన్ లను తొలగించేసరికి కాస్త చల్లబడతారనే కమెంట్లు వినిపిస్తున్నాయి!