తెలుగుదేశంలో మొదలైన అంతర్మధనం

chandrababu

chandrababu

ఏమిటి కర్తవ్యమ్? ఇపుడు ఏమిటి దారి? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే కాక వివిధ జిల్లాస్థాయి, తాలూకా స్థాయి నాయకుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి! నలభై ఏళ్ళక్రితం ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులు చెక్కు చెదరకుండా నిన్న మొన్నటివరకు పార్టీని నిలబెట్టాయి. చంద్రబాబు చేతిలోకి పెత్తనం వచ్చాక తెలుగుదేశం పార్టీ సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి దూరమైంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి పదవులకు పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, లిక్కర్ వ్యాపారులు మాత్రమే చంద్రబాబుకు ప్రియంగా మారారు. కోటానుకోట్ల రూపాయలను ముడుపులుగా (ముద్దుగా విరాళాలు) పుచ్చుకుని టికెట్లు కేటాయించడం, వారి గెలుపుకోసం సామాన్య కార్యకర్తలు కృషి చెయ్యడం, గెలిచాక కార్యకర్తలకు పురచేయిని చూపడం…చంద్రబాబు మొదటినుంచి ఆచరిస్తున్న విధానాలు. దానికి తోడు అందరిలో కులమైకాన్ని విపరీతంగా ఎక్కించేశారు. అందుకోసం రామోజీరావు, రాధాకృష్ణ లాంటి పత్రికాధిపతులను ఉపయోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం కమ్మ కులస్తులకే అన్నట్లుగా పార్టీని తీర్చిదిద్ది, చంద్రబాబు లేకపోతె కమ్మవారికి జీవితమే లేదన్నంతగా ప్రజల మనసులను కలుషితం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలలో కూడా కమ్మ విద్యార్థులతో సంఘాలను ఏర్పాటు చేయించారు. కీలకస్థానాల్లో కమ్మవారిని నియమించేట్లు పధకాలు రచించారు. అలాగే వివిధ రాజ్యాంగ వ్యవస్థల్లో కూడా కమ్మ సామాజికవర్గం వారు ఉన్నత స్థానాలు అలంకరించేట్లుగా పాతికేళ్ళక్రితమే పన్నాగాలు పన్ని అమలు చేశారు.

చంద్రబాబు సహకారం వలన ఉన్నత స్థానాలు పొందినవారు, వ్యాపారప్రయోజనాలు పొందినవారు చంద్రబాబుకు విశ్వాసపాత్రులుగా పనిచేయడం మొదలు పెట్టారు. చంద్రబాబుకు రాజకీయంగా శత్రువులు అనుకునే వారిపట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబుకు పేరుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నది కానీ, ఆయనకు అక్షరం ముక్క రాదు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆయన చాలా పూర్. అయినప్పటికీ ఆయనను మహామేధావిగా, విజనరిగా చిత్రించడంలో పచ్చపత్రికలు పోటీ పడ్డాయి. ఆ పత్రికల రాతలు చూసినవారు చంద్రబాబు నిజంగా అంత గొప్ప మేధావేమో అని భ్రమల్లో మునిగారు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని చంద్రబాబు అసలు తెలివితేటలు రాజుగారి దేవతవస్త్రాలవంటివే అని అందరికీ తెలిసిపోయింది.

ఆయన మేధస్సు ఎలాంటిదైనా పాతికేళ్ళపాటు పార్టీని బ్రతికించారనేది నిస్సందేహం. రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు కుటిలబుద్ది మీద ఆయన సామాజికవర్గం వారికి ఎక్కడలేని నమ్మకం ఉన్నది. చంద్రబాబును అడ్డం పెట్టుకుని వేలకోట్ల రూపాయలను ఆర్జించారు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఎన్టీఆర్ అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధానికి రామోజీ రావు పూర్తి మద్దతు పలికి ఎనలేని ప్రచారాన్ని ఇచ్చారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అమలు చెయ్యడంతో రామోజీరావు నిర్మించిన ఫిలిం సిటీ దివాళా తీసేపరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ మీద కన్నా తన వ్యాపారాల పట్ల అధిక ఆసక్తి కలిగిన రామోజీరావు చంద్రబాబును ఎగదోసి ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయించారు. చంద్రబాబు రాగానే మద్యపాన నిషేధం వలన ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో అదే రామోజీరావు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు ప్రచురించి మద్యనిషేధాన్ని ఎత్తివేయించారు! దీనివలన తేలేది ఏమిటంటే చంద్రబాబుకు మద్దతు పలికేవారికి పార్టీ ముఖ్యం కాదు. వారి వ్యాపార ప్రయోజనాలు.

2004 లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పటికీ కమ్మ సామాజికవర్గంలోని కోట్లాధిపతులు అందరూ చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. కారణాలు ఏమిటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎత్తితేనే వారికి నిద్రపట్టదు. మరొకటి ఏమిటంటే ఆనాటికి చంద్రబాబు వయసు యాభై నాలుగు సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఆయనకు ఇంకా బోలెడంత భవిష్యత్తు ఉన్నది. సహకరిస్తే మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నది. కమ్మ సామాజికవర్గం పారిశ్రామికవేత్తలు పేరుకు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారి మనసులో ఉండేది చంద్రబాబు నాయుడే అనడంలో ఏమాత్రం మొహమాటం లేదు. బీజేపీలో అగ్రనాయకులైన వెంకయ్యనాయుడు, హరిబాబు, కమ్యూనిస్ట్ పార్టీల్లో అగ్రనాయకులైన నారాయణ, రాఘవులు, కాంగ్రెస్ పార్టీలో కాంట్రాక్టర్లు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు లాంటివారు కూడా తనువులు వారి వారి పార్టీల్లో ఉన్నా మనసు మాత్రం చంద్రబాబువైపే ఉంటుంది. చంద్రబాబుతో బీజేపీ, జనసేన, కాంగ్రెస్ లాంటి పార్టీలతో పొత్తులు కుదర్చడంలో రామోజీరావు, రాధాకృష్ణ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు. వారందరి సహకారం ఫలించి రాష్ట్రం విడిపోవడంతో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు.

ముఖ్యమంత్రి కాగానే అమరావతి పేరుతో దోపిడీకి తెరలేపారు చంద్రబాబు. చంద్రబాబుకు ఆర్ధికసహకారం అందించే సుజనాచౌదరి, నారాయణ, రాయపాటి లాంటి పెద్దపెద్దవారికి తగిన పదవులను కట్టబెట్టారు. అయితే ఎవ్వరూ ఊహించనివిధంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం దారుణంగా ఓడిపోవడంతో ఒక్కసారిగా అందరూ ఖంగు తిన్నారు. ఎవరెస్టు నుంచి పాతాళానికి జారిపోయినట్లు విలవిలలాడారు. అప్పటికీ వారు ఏమాత్రం జంకకుండా చంద్రబాబును భుజాన మోస్తూనే ఉన్నారు. రెండేళ్ల తరువాత మొన్న జరిగిన పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోవడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో పోలిస్తే దాదాపు పదిశాతం ఓటుబ్యాంక్ తగ్గడం వారందరిని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. చంద్రబాబు నాయకత్వపటిమ పట్ల మొదటిసారిగా కమ్మ సామాజికవర్గంలో సందేహాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత ఛండాలంగా పరిపాలించినా మరొక టర్మ్ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఇక చంద్రబాబుకు 2029 వరకూ ఎలాంటి ఆశలు లేవు. అప్పటికి చంద్రబాబు ఎనభైఏళ్ల వయసులోకి వెళ్లారు. లోకేష్ ను చూస్తే పరమశుంఠగా పేరుతెచ్చుకుని కేవలం ట్విట్టర్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. అతనిలో చురుకుదనం, పార్టీని నడిపించే లక్షణాలు, వాగ్ధాటి ఏ కోశానా లేవు. దానికితోడు అతనికి తెలుగు మాట్లాడటం కూడా రాదు. లోకేష్ మీద చంద్రబాబుకే ఆశలు లేవు. ఇక మామూలు నాయకులకు ఎలా ఉంటాయి?

తమ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడలేరని ధృవీకరించుకున్న తరువాత ఆ సామాజికవర్గంలోని హేమాహేమీలు మరొక నాయకుడికోసం అన్వేషిస్తాయి. ఎందుకంటే వారికి చంద్రబాబు ప్రధానం కాదు. తమ వ్యాపారాలు మాత్రమే ముఖ్యం. బహుశా జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి తెలుగుదేశం వెళ్లే అవకాశం ఉన్నది. ఇదే రామోజీ, రాధాకృష్ణ అప్పుడు చంద్రబాబును భుజాలమీదినుంచి కింద పడేస్తాయి. జూనియర్ ను నెత్తిన పెట్టుకుంటాయి. 2024 ఎన్నికల తరువాత ఈ పరిణామాలు సంభవించే అవకాశాలు మిక్కుటంగా ఉన్నాయి.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు