సుప్రీం కోర్టు చెప్పిన విలువైన పాఠాలు

Lessons taught by the Supreme Court

సందర్భం వేరు కావచ్చు.  కేసు వేరు కావచ్చు…కానీ సెంట్రల్ విస్టా కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని చెప్పాలి.  న్యాయమూర్తి పదవి అంటే  ఒక రాష్ట్రానికో, దేశానికో మహారాజు పదవి లాంటిదని, ఆ గద్దె మీద కూర్చుని చిత్తం వచ్చిన వ్యాఖ్యలు చేయవచ్చని, తమను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో పరిధులను విస్మరించి ప్రజా ప్రభుత్వాలపై పెత్తనాలు సాగించవచ్చనే గర్వాంధులకు కనువిప్పు కలిగించే విధంగా సుప్రీమ్ కోర్ట్ కొన్ని వ్యాఖ్యలను చేసింది.  

Lessons taught by the Supreme Court
Lessons taught by the Supreme Court

వారి వ్యాఖ్యలు ఆ ఒక్క కేసుకు మాత్రమే పరిమతమయ్యేలా ఉంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాలు ఎలా పని చెయ్యాలో, ఎలా తమ విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలో తెలియజేస్తూ, తమది కాని అధికారంలో జోక్యం చేసుకోరాదని  న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.  

1 .  కొందరు వేస్తున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అత్యుత్సాహంగా ఉంటున్నాయి.  

2 . ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద నిధులు వెచ్చిస్తుంటే దాన్ని కాదని మరొక ప్రాజెక్ట్ పై నిధులు వెచ్చించాలని మేము ప్రభుత్వాన్ని ఆదేశించలేము.  

3 .  ప్రభుత్వాలు కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో న్యాయస్థానాలు నిర్దేశించలేవు.  

4 . ఫలానా మార్గంలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే వారి విజ్ఞతను మేము ప్రశ్నించలేము. 

5 .  మొదటి దశలోనే విధానాల అమలును ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేము. 

6 .  ఎలాంటి చట్ట ప్రాతిపదిక లేకుండా మేము ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేము. 

7 . న్యాయస్థానాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పని చేస్తాయి. 

8 .  ప్రభుత్వ విధానాలను పరిశీలించాలని పిల్స్ ఎక్కువగా వస్తున్నాయి.  మేము పరిపాలించడానికి లేము.  అందుకు అవసరమైన కౌశలం, నైపుణ్యం మాకు లేవు.  

9 .  ప్రభుత్వ విధానాలు, రాజకీయ అంశాలపై చర్చ జరగాల్సింది చట్టసభల్లోనే తప్ప న్యాయస్థానాల్లో కాదు.  

10 .  ప్రభుత్వం తీసుకునే చర్యల్లో చట్టబద్ధతను పరిశీలించడంలో న్యాయస్థానాల పాత్ర చాల పరిమితం.  

మరి గౌరవ హైకోర్టులో ఏమి జరుగుతున్నది?  గత ఏడాదిన్నరగా గౌరవ న్యాయమూర్తులు ఎన్ని వందల సార్లు ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకున్నారు?  ప్రభుత్వం మీద, ప్రజాముఖ్యమంత్రి మీద ఎంత దారుణంగా విషాన్ని విరజిమ్మారు?  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎంత నీచమైన వ్యాఖ్యలు చేసి అవమానించారు?  రాజధాని వికేంద్రీకరణకు మోకాలడ్డారు.  చివరకు విశాఖలో ఒక భవనాన్ని నిర్మించుకోవాలన్నా ప్రభుత్వానికి ఆ హక్కే లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఆంగ్ల మీడియా చదువులు ప్రభుత్వ విధాన నిర్ణయం అని తెలిసీ కూడా దానిమీద స్టే ఇచ్చారు.  ఒకరకంగా చెప్పాలంటే కొందరు న్యాయమూర్తులు పైనుంచి కొందరు ఇస్తున్న ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారా అని సామాన్యుడు కూడా సందేహించేవిధంగా న్యాయదేవతను ఖూనీ చేశారు.  

నాబోటివారు మొదటినుంచి ఒకటే చెబుతున్నారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే తుది నిర్ణయం.  అందువలన ప్రజలు నష్టపోతే మరుసటి ఎన్నికల్లో వారు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు.  న్యాయవ్యవస్థకు  తన హద్దులు దాటి ప్రభుత్వ పరిపాలనలో జోక్యం చేసుకునే అధికారం లేదు.  

సుప్రీమ్ కోర్ట్ నిన్న చేసిన వ్యాఖ్యలను దేశంలోని న్యాయమూర్తులు అందరూ బట్టీయం వేసి తమ టేబుల్స్ మీద వ్రాయించి పెట్టుకోవాలి.  తీర్పులు ఇచ్చేముందు వాటిని మననం చేసుకోవాలి. అనవసరమైన పిల్స్ వేస్తూ కోర్టు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసేవారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలి.  ఈ మేరకు చట్టం ఎవరు చెయ్యాలో వారు చొరవ తీసుకోవాలి.  

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు