కోర్టుల ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదని, అమలు చేయవద్దని రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అనధికార ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శిక్షణలో భాగంగా ముస్సోరి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారని వారిని నిలదీసింది. కోర్టు ఆదేశాలు ఎలా అమలు చేయకూడదో అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో 90 శాతం మంది అధికారులు తాము చట్టాలకు అతీతులమని అనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. కనీస టైం స్కేల్ అమలు చేయాలని కోర్టు ఆదేశించినా అమలు చేయడం లేదంటూ ఎస్‌కేఆర్ కాలేజీలో పనిచేస్తున్న అటెండర్ ఆర్‌వీ అప్పారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కాలేజీ కరస్పాండెంట్ ఒత్తిడి చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆగ్రహించారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా బెదిరించడం ఏమిటని నిలదీశారు. అటెండర్‌కు ఇవ్వాల్సిన కనీస టైం స్కేల్‌పై ఇచ్చిన ఉత్తర్వులను మూడేళ్లుగా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ప్రత్యక్ష విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను తోసిపుచ్చారు. దేవదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ నాయక్, రాజమహేంద్రవరం ఆర్‌జేడీ డేవిడ్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.
ప్రతివాదులు కోర్టుకు హాజరవుతారని.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్ధించారు. మధ్యాహ్నం జరిగిన విచారణలో అర్జున్‌రావు, ఎంఎం నాయక్, శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల కరస్పాండెంట్ హాజరై వివరణ ఇచ్చారు. దీంతో అర్జున్‌రావు, నాయక్‌లపై వారెంట్లను కోర్టు వెనక్కి తీసుకుంది. విచారణకు హాజరుకాని ఆర్జేడీపై మాత్రం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి సంబంధిత అధికారిని కోర్టు ముందు హాజరుపరచాలని రాజమండ్రి అర్బన్ ఎస్పీని ఆదేశించింది. మూడేళ్లుగా కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.