కట్టుబాట్లు దాటిన న్యాయమూర్తులు

రాజకీయేతర పదవులు, ఉద్యోగాల్లో ఉన్నవారిని బదిలీలు చెయ్యడం సర్వసాధారణం. వాటికి ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ, అత్యంత రహస్యంగా జరిగే న్యాయమూర్తులు బదిలీల సమాచారం కొందరు నాయకులకు, పచ్చ మీడియాకు ఎలా లీక్ అయిందనేది అంతుబట్టని రహస్యం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చెయ్యడానికి కుట్ర జరుగుతున్నదని కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ ఆరోపించారు. న్యాయమూర్తిని బదిలీ చెయ్యడంలో తప్పేముందో, అందుకు కుట్ర చెయ్యాల్సిన అవసరం ఏముందో ఆయనకే తెలియాలి. అలాగే జస్టిస్ మహేశ్వరి బదిలీ విషయన్ని ఆంధ్రజ్యోతి ముందుగానే ప్రచురించింది. కొలీజియం ప్రతిపాదన అనేది రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేనే కానీ అమలులోకి రాదు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడి, నోటిఫికేషన్ వచ్చేంతవరకు అది రహస్య సమాచారమే. అయినప్పటికీ ఆ సమాచారం పచ్చమీడియాకు ముందే తెలిసింది అంటే న్యాయవ్యవస్థలో కూడా తెలుగుదేశం వారి స్లీపర్ సెల్స్ గట్టిగా పాతుకునిపోయాయనే అర్ధం చేసుకోవాలి.

ఇక గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ పై అంతులేని విమర్శలు రేగుతున్నాయి. సామాన్యులే కాదు, మేధావులు సైతం ఆంధ్రా హైకోర్టు పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతూ కొన్ని రాజకీయపార్టీలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా హైకోర్టు పని చేస్తున్నదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు నిజమే అన్నట్లు కొందరు న్యాయమూర్తులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడం, తమ హద్దులు మీరి పరుష వ్యాఖ్యలు చెయ్యడం, ఆ వ్యాఖ్యలను కొన్ని పచ్చ పత్రికలు భూతద్దంలో చూపిస్తూ అధికారపక్షానికి వ్యతిరేకంగా విషాన్ని చిమ్ముతున్నప్పటికీ, న్యాయస్థానం వాటిని పట్టించుకోకపోవడం చూస్తుంటే న్యాయవ్యవస్థ పనితీరు మీద ఎవరికైనా సందేహాలు కలగక మానవు.

వాటన్నిటికీ పరాకాష్టగా బహుశా దేశంలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తిని ధర్మాసనం నుంచి తప్పుకోవాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చెయ్యడం అతి పెద్ద సంచలనం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పట్ల తమకు విశ్వాసం లేదని ఒక రాజ్యాంగబద్ధ ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించినట్లయింది. హైకోర్టుకు ఇంతకన్నా ఘోరావమానం మరొకటి ఉండబోదు. జస్టిస్ రాకేష్ కుమార్ తన హద్దులను ఏనాడో అతిక్రమించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే ఆయన విధానంగా కనిపిస్తున్నది. వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు న్యాయమూర్తులకు ఉండకూడదు అని కాదు. కానీ, ధర్మాసనం మీద కూర్చున్న తరువాత ఆయన న్యాయదేవతకు ప్రతినిధిగా నిష్పాక్షిక విచారణ చెయ్యాలి. తీర్పులు పక్షపాత రహితంగా ఉండాలి. కేసు పరిధికి మించిన వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యరాదు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం తమ కట్టుబాట్లను విస్మరించి ఒక ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీ, డిజిపి వంటి అత్యున్నత వ్యవస్థలమీద దాడి చెయ్యడానికి తెగించారు. ఆయన ఉండగా తమకు న్యాయం జరగదని రాష్ట్రప్రభుత్వం కుండబద్దలు కొట్టి చెప్పడం అంటే అది హైకోర్టు మీద అభిశంసనే. ఇంత జరిగాక కూడా ఆ న్యాయమూర్తి ఆ కేసు విచారణ నుంచి తప్పుకోకపోతే అది న్యాయదేవతకే ద్రోహం చేసినట్లవుతుంది. ఆయన ఇచ్చే తీర్పుకు కూడా విలువ, గౌరవం లభించవు. మరో పదిహేను రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న న్యాయమూర్తి చివరి దశలో ఒంటిమీద మచ్చలు వేయించుకుని వెళ్లడం విషాదకరం.

ఇన్నాళ్లకు న్యాయవ్యవస్థకు అంటుకున్న చీడపురుగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేతంగా మొదలు పెట్టిన యుద్ధం సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొత్తాన్ని సమూలంగా ప్రక్షాళన గావించాలి. న్యాయం, ధర్మం, చట్టానికి నిజమైన ప్రతినిధులతో ధర్మాసనాలను నింపాలి. ఒక రాష్ట్ర హైకోర్టు ఇంతగా అపఖ్యాతిపాలు కావడం దేశంలోనే మొదటిసారి. ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సృష్టించడం ఆంధ్రుల దురదృష్టం. న్యాయమూర్తులు బదిలీలపై వెళ్ళిపోతున్నారంటే ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారంటే న్యాయవ్యవస్థకు అంతకు మించిన శిక్ష మరొకటి లేదు.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు