సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) ఒక పోలీటెక్నిక్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటాడు. కుప్పం వూర్లో తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతని సోదరుడు (రవి కాలే), ఇంకా శరత్ (అర్జున్ గౌడ) తమ బలగంతో ప్రజల భూములు కాజేసి, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వుంటారు. అడ్డువచ్చిన వాళ్ళని నరుకుతూ తమకి ఎదురులేదు అనే విధంగా వుంటారు.
ఒకరోజు తమ్మిరెడ్డి మనుషులు ఒక యువకుడిని వెంటాడుతూ చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం అడ్డుపడతాడు, తన వుద్యోగం పోగొట్టుకుంటాడు. అదే కాలేజ్ లో పని చేస్తున్న టీచర్ (మాళవిక శర్మ) తో ప్రేమలో ఉంటాడు సుబ్రహ్మణ్యం. తన తండ్రి చేసిన అప్పులు తీర్చటం కోసం డబ్బులు గడించాలని , సస్పెండ్ అయిన పోలీసు కానిస్టేబుల్ పళని (సునీల్) తో చేతులు కలిపి ఖాళీగా వున్న ఒక సినిమా థియేటర్ లో గన్స్ తయారు చేసి అవి దొంగచాటుగా అమ్మడం మొదలుపెడతాడు. తన తండ్రిని తమ్మిరెడ్డి మనుషులు కట్టి తీసుకువచ్చి చంపటానికి ప్రయత్నం చేస్తుంటే, సుబ్రహ్మణ్యం వాళ్ళని అడ్డుకుంటాడు, తండ్రిని కాపాడుకుంటాడు. సుబ్రహ్మణ్యం పేరు కుప్పంలో మారుమోగుతోంది, ప్రజలు అతన్ని దేవుడిగా చూస్తూ వుంటారు. రెడ్డి మనుషులు ఎందుకు తన తండ్రిని చంపాలని అనుకుంటారు? దొంగతనంగా గన్స్ ఎక్కడ నుండి తయారవుతున్నాయో తెలుసుకోవడానికి వచ్చిన స్పెషల్ పోలీసు ఆఫీసరు (అక్షర గౌడ) ఏమి కనుక్కుంది? రెడ్డి సోదరులకు, సుధీర్ బాబు కి మధ్య యుద్ధం ఎలా, ఎప్పుడు మొదలయిందనేదే ’హరోం హర’ సినిమా స్టోరీ. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో వచ్చిన ఈ ’హరోం హర’ అల్లు అర్జున్ నటించిన ’పుష్ప’ సినిమాకి దగ్గరగా ఉంటుంది. అందులో గంధంచెక్కల దొంగతనంగా అమ్ముతూ, డబ్బులు గడిస్తూ పుష్ప పెద్దవాడైతే, ఇందులో గన్స్ తయారుచేస్తూ వాటిని దొంగతనంగా అమ్ముతూ పెద్దవాడవుతాడు సుబ్రహ్మణ్యం. ఆ సినిమా కూడా చిత్తూరు, తిరుపతి నేపధ్యం అయితే, ఈ సినిమా చిత్తూరు జిల్లాలో కుప్పం నేపథ్యంలో వచ్చిన సినిమా.
దానికితోడు గన్స్ తయారుచేస్తూ, దొంగతనంగా అమ్ముతూ, అడ్డువచ్చిన విలన్స్ చంపుకుంటూ పోయే సుబ్రమణ్యాన్ని దేవుడుగా చిత్రీకరిస్తాడు దర్శకుడు. అలాగే సుబ్రహ్మణ్యం తను కాబోయే భార్యకి గన్స్ అమ్మి డబ్బు గడిస్తున్నాను అంటే అది ఆమె సమర్ధించటమే కాకుండా, అది చాల మంచిది అన్నట్టుగా చెప్పించాడు దర్శకుడు. ’కేజీఎఫ్’ సినిమా కూడా దర్శకుడిపై బాగా ప్రభావం చూపించినట్టుంది, అందుకని ఆ సినిమా ఛాయలు కూడా ఈ ’హరోం హర’ లో కనిపిస్తాయి. ’హరోం హర’ సినిమా మొదలవడం ఆసక్తికరంగానే సాగుతుంది, కానీ తరువాత కొన్ని సాగదీత సన్నివేశాలతో నింపేసాడు దర్శకుడు.
విలన్ మనుషులతో సుధీర్ బాబు తలపడే సన్నివేశం నుండి కథ కొంచెం వేగం పుంజుకుంటుంది. అయితే దర్శకుడు మొదటి సగం వరకు సినిమాని బాగానే చూపించగలిగాడు. కానీ రెండో సగంలో కథ ఏమి చెయ్యాలో తెలియక, ఎక్కువగా పోరాట సన్నివేశాలపై దృష్టి మరల్చాడు. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసాడు కూడా. చేతిలో పదిరూపాయలు కూడా లేని కథానాయకుడు ఒక్కసారిగా ధనవంతుడు అవటం అనేది ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం ఇప్పటివరకు. అందుకని దర్శకుడు ఇందులో కొత్త పాయింట్ ఏవిూ చెప్పలేదు, అదే కథలని తిప్పి తిప్పి తీసాడు, కొంచెం కుప్పం యాస పెట్టాడు అంతే. దర్శకుడు కేవలం సుధీర్ బాబుని ఒక మాస్ అవతార్ లో చూపించాలని ఈ కథని రాసినట్టుగా కనపడుతోంది.
ఈ సినిమాలో హింస మరీ ఎక్కువయింది, తలలు నరకటం, మొండాలు చూపించడం తగ్గిస్తే బాగుండేది. ఇప్పుడు చాలా సినిమాల్లో అదొక ఫ్యాషన్ అయిపొయింది.ఇక నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు ఒక మాస్ అవతార్ లో కనపడతారు, అతని బాడీ, అతని ఫిజిక్ చూపించడానికి ఈ సినిమా ఉపయోగపడిరది. పోరాట సన్నివేశాల్లో బాగున్నారు, అతని పాత్రని సంఘర్షణలతో కూడి బలంగా రాసి ఉంటే బాగుండేది. కథలో కొత్తదనం లేదు, ఏమి జరుగుతుందో ముందే ఊహించుకోవచ్చు.
రేటింగ్:2.5/5