బీజేపీ ముసుగులు తొలగే సమయం ఆసన్నమైంది 

మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ముందుకు వెళ్ళడంతో అనేక రాజకీయ కోణాలు చర్చకు వస్తున్నాయి.  గవర్నర్ బిల్లు మీద తీసుకోబోయే నిర్ణయం మీద ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఏమిటనేది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది తేలిపోనుంది.  బిల్లును రాజ్యాంగ పరంగా అడ్డుకునే వీలే లేదని, గవర్నర్ ఆమోదించి తీరాల్సిందేనని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటుంటే తెలుగుదేశం మాత్రం బిల్లు మండలి ఆమోదం పొందలేదని, సెలెక్ట్ కమిటీ ముందు ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని, విభజన హామీ మేరకు రాజధాని మార్చడం అసంభవమని అంటోంది.  అయితే ఆ కారణాలేవీ రాజ్యాంగ ప్రక్రియను ఆపలేవు.  దీంతో వ్యవహారం మొత్తం బీజేపీ చేతిలోనే ఉన్న పరిస్థితి కనబడుతోంది.
 
ఎందుకంటే గవర్నర్ వద్ద బీజేపీ మాట చెల్లుబాటయ్యే సిట్యుయేషన్ ఉంది కాబట్టి.  ఎందుకంటే గవర్నర్ గతంలో బీజేపీ సీనియర్ నాయకుడిగా పనిచేసి ఉన్నారు.  ఆయన రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోక ముందే ఆయన్ను ఏపీకి గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం.  ఎంత రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తారని పైకి చెప్పినా అంతర్గతంగా కేంద్రం సలహా తీసుకోనిదే ఆయన తుది నిర్ణయం తీసుకోరని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  ఇందులో కూడా నిజం లెకపోలేదు.  కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్ పదవుల్లో వీలైనంత వరకు తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులనే నియమించుకుంటాయి.  క్లిష్ట పరిస్థితుల్లో వారిని తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేస్తాయి.  గతంలో ఇలాంటి పరిణామాలు చాలానే జరిగాయి. 
 
ఈసారి కూడా అలాగే జరగొచ్చు.  గవర్నర్ అమిత్ షా లాంటి ముఖ్య నేతల సలహాతోనే తుది నిర్ణయాన్ని ప్రకటించవచ్చు.  ఆ నిర్ణయాన్ని బట్టి ఇన్నాళ్ళు వైఎస్ జగన్ పట్ల ద్వంధ వైఖరిని అవలంభిస్తూ వచ్చిన బీజేపీ అధిష్టానం యొక్క అసలు రంగు ఏమిటో బయటపడిపోతుంది.  ఒకవేళ గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపితే జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్రం పూర్తి సానుకూలతతో ఉందని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా జగన్ కు సహాయ సహకారాలు అందిస్తుందని, ఇన్నాళ్ళు సీఎం రమేష్, సుజనా చౌదరిలు వైసీపీ ప్రభుత్వం మీద అడపాదడపా  విమర్శలు చేస్తూ వచ్చింది నామమాత్రపు ప్రతిపక్ష పాత్రను పోషించడానికేనని రూఢీ అవుతుంది.  ఇదే జరిగితే రానున్న రోజుల్లో వైఎస్ జగన్ తన ఎంపీలతో కావాల్సినప్పుడల్లా బీజేపీను బలపరుస్తూ ఉంటారు.  
 
అలా కాకుండా కేంద్రం మూడు రాజధానులను అడ్డుకోవాలని అనుకుంటే అడ్డుకోవచ్చు కూడ.  కానీ అది రాజ్యాంగ పరంగా కాదు రాజకీయంగా.  పైన చెప్పుకున్నట్టు మూడు రాజధానుల విధానానికి రాజ్యాంగంలో ఎలాంటి చిక్కులు లేవు.  కాబట్టి గవర్నర్ సులభంగా ఆమోదం తెలపవచ్చు.  అలా కాకుండా అడ్డుపడాలి, ఆపాలి అనుకుంటే మాత్రం టీడీపీ వాదిస్తున్న తరహాలోనే మండలి ఆమోదం లేదు కదా, సెలెక్ట్ కమిటీ నిర్ణయం రానివ్వండి అంటూ గవర్నర్ తన నిర్ణయాన్ని హోల్డ్ చేసి కాలయాపన చేయవచ్చు.  ఒకవేళ బీజేపీ అలా చేస్తే జగన్ మౌనం వహించడం తప్ప తిరిగి చేసేది ఏమీ ఉండదు.  అదే జరిగితే వైఎస్ జగన్, బీజేపీల మధ్యన సఖ్యత లేదని, ఇకపై ఉండబోదని అర్థం.  ఈ పరిణామం గనుక చోటు చేసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రాలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని డిసైడ్ అయినట్టే.  
 
ఆ మేరకు తన మిత్రపక్షం జనసేనను కలుపుకుని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వైసీపీకి వ్యతిరేక దిశలో పనిచేయడం ఆరంభిస్తుంది.  అప్పుడిక టీడీపీ కూడా వారితో కలిసే అవకాశం లేకపోలేదు.  అన్నీ సవ్యంగా జరిగితే మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీకి దిగి 2014 నాటి పరిస్థితుల్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి.  అది వైసీపీకి ఇబ్బందికర పరిణామమే అవుతుంది.  కానీ ప్రస్తుతం జగన్ కు ఉన్న బలం వచ్చే ఎన్నికల నాటికి అలాగే ఉంటే కొంచెం ఇబ్బంది పడినా అధికారాన్ని దక్కించుకునే వీలుంది.  సో.. ఈ భవిష్యత్ పరిణామాలన్నీ త్వరలో గవర్నర్ తెలపబోయే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి.  ఆ నిర్ణయం ద్వారానే ముసుగులన్నీ తొలగిపోయి అసలు ఆంధ్రా మీద బీజేపీ ఆశలు, వ్యూహాలు ఏమిటనేది తేలిపోతుంది.