పొద్దునే పత్రికల్లో చూసిన శుభవార్త ఏమిటంటే… ఇప్పటివరకూ గృహావసరాలకోసం వాడే గ్యాస్ సిలిండర్లపై కేంద్రం వారు దయతలచి తిరిగి వినియోగదారుల ఖాతాల్లో వేస్తున్న ముష్టి నలభై రూపాయలు ఇకపై ఉండదట. సిలిండర్ ధర ఎంతయితే అంత మొత్తం డబ్బులు ఇచ్చే కొనుక్కోవాల్సిందే.
ఇక పెట్రోల్, డీజిల్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. సెంచరీ మార్కు చేరుకోవడానికి పెట్రోల్ సిద్ధంగా ఉన్నది. 1989 లో నేను మొదటిసారి ద్విచక్రవాహనం (సైకిల్ కాదులెండి) కొన్నప్పుడు లీటర్ పెట్రోల్ ఎనిమిదో, తొమ్మిదో రూపాయలు ఉండేది. నేను కొన్న నాలుగు రోజులకే బడ్జెట్ వచ్చి పెట్రోల్ ధర అర్ధరూపాయో, పావలానో పెరిగింది. నాకు చచ్చే ఆవేశం వచ్చి ఇకనుంచి బండి వాడకూడదని నిర్ణయించుకున్నాను. రెండు రోజులు బస్సుల్లో తోసుకుంటూ, రాసుకుంటూ, బస్సు లోపలకి దారి లేక ఫుట్ బోర్డు మీద వేలాడుతూ సర్కస్ ఫీట్లు చేస్తూ ఆఫీసుకు వెళ్లిరావడంతో నాకు చుక్కలు కనిపించాయి. ఇది కూడా శ్మశాన వైరాగ్యం లాంటిదే అని గ్రహించి మళ్ళీ నా ద్విచక్రాలను పరుగులు పెట్టించాను.
ఆ తరువాత అనేకసార్లు నాకు ఇలాంటి శ్మశాన వైరాగ్యం కలిగింది. పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా ఆవేశం రావడం, బస్సుల్లో ఎక్కడం, ఆ బస్సు సమయానికి రాక ఆఫీసుకు వెళ్ళడానికి ఆలస్యం కావడం, ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళడానికి బస్సుకోసం గంటలు గంటలు ఎదురు చూడటం, ఐదుంపావు కల్లా ఇంట్లో ఉండాల్సినవాడిని తొమ్మిదింటికి చేరడం, నేనేదో సినిమాకో షికారుకో వెళ్ళొచ్చానని మా ఆవిడ అనుమానించడం…ఈ రభసను భరించలేక మళ్ళీ బండి తియ్యడం…ముళ్ళపూడి వెంకట రమణ సిగరెట్ మానేసినన్నిసార్లు జరిగింది.
ఇక ఆ తరువాత మళ్ళీ బస్సు ఎక్కలేదు ఇంతవరకు. భాగ్యనగరంలో నేను బస్సెక్కి పాతికేళ్ళు దాటింది. నాలాగే అందరూనూ. పెట్రోల్ వందకాదు, వెయ్యి రూపాయలైనా సరే ఎవ్వరూ మెట్రోలు, బస్సులు ఎక్కి ప్రయాణాలు చెయ్యరు. ఈ రోజుల్లో రెండు చక్రాలు కానీ, నాలుగు చక్రాలు కానీ సొంతవాహనం లేనివారు చాల అరుదు. ఒకసారి స్టీరింగ్ తిప్పుతూ, హారన్ కొట్టుకుంటూ, నడిచి, మోపెడ్లు, సైకిళ్ళమీద వెళ్తున్నవారిని చూసి నవ్వుకుంటూ, విలాసాలు మరిగినవారు ఇంధనం ధరలు పెరిగాయని ఆర్టీసీవారిని, ఆటోవారిని ఆశ్రయించరు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయాణాలు చాలావరకు భూగర్భ రైళ్లలో, ప్రభుత్వ బస్సుల్లో జరుగుతాయి. అక్కడి జనాభా తక్కువ, జనాభాకు అనేకరెట్లు వైశాల్యం ఎక్కువ. మనదేశంలో అలాంటి అద్భుతాలు సాధ్యం కావు. మహేష్ బాబులా మేకప్ చేసుకుని మెరిసిపోతూ బస్సెక్కినవారు పదికిలోమీటర్లు ప్రయాణించి దిగే సమయానికి బాబూ మోహన్ లా తయారవుతారు.
ఇంధన ధరలు ఒకప్పుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పెరిగేవి. అది కూడా స్వల్పంగా. ఆమాత్రానికే అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు, సైకిళ్ళమీద అసెంబ్లీకి వెళ్లే మంత్రులు, ముఖ్యమంత్రులు, లాంతర్లు పట్టుకుని వెళ్లే నాయకులు తమ నిరసనలు వ్యక్తం చేసేవారు. ప్రజలు కూడా సహకరించేవారు. కానీ, ప్రస్తుతం అలాంటి అద్భుతాలు జరిగే అవకాశం లేదు. పెరుగుతున్న ధరలకు ప్రజలు అలవాటు పడిపోయారు. “పెరుగుట విరుగుట కొరకే” అని పెద్దలు చెప్పినప్పటికీ, పెరుగుట మరింత పెరుగుటకొరకే” అని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. అందుకనే మన ప్రభుత్వాలు నిర్మొగమాటంగా, నిష్కర్షగా ధరలు పెంచుతూనే ఉంటారు. ప్రజలు చచ్చినట్లు భరిస్తూనే ఉంటారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు