వ్యవస్థలు గాంధారీపతి కారాదు

Election Commission and the courts will not stop the development
ఏమిటో ఆ సంతోషం! ఆకాశంలో ఒంటికన్ను గుడ్లగూబలా ఎగిరినంత సంబరం!  రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా రాష్ట్ర ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాలని, అయన అనుమతి ఇవ్వకపోతే మా తలుపు తట్టాలని సుప్రీమ్ కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించడం అంటే సర్కార్ వెళ్లి  ఎన్నికల కమీషన్ చేతిలో చిక్కడమేనట! జగన్ వెళ్లి నిమ్మగడ్డ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనట…నిమ్మగడ్డ “నో” అని గావుకేక పెడితే వెంటనే ఢిల్లీ వెళ్లి అక్కడ కోర్టుముందు అర్ధించాలట!  ఏమి మన క్షుద్ర పత్రికల పైశాచిక ఆనందం!!  
Election Commission and the courts will not stop the development

 

అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగం కాదు 
రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరంతరం జరిగే పాలనాప్రక్రియలో భాగం మాత్రమే. పాపం…  అభివృద్ధి పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలు మాత్రమే వారికి మొదటినుంచి తెలుసు. చంద్రబాబు ఉమ్మేసే వాంతులశేషం కోసం గంతులువేసే పచ్చ భజన మీడియాకు అసలు సిసలు అభివృద్ధి అంటే ఏమిటో ఇప్పుడు కళ్ళముందు జగన్మోహన తాండవం చేస్తుంటే ఆ మెరుపులు చూడలేక, ఆ కాంతులను భరించలేక ధృతరాష్ట్రుడిలా కళ్ళుమూసుకుపోయిన, బలవంతంగా మూసుకున్న అంధులకు ఏమాత్రం జీర్ణం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయువు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది.  ప్రజలు ఆమోదిస్తే మరోసారి కూడా జగన్ ప్రభుత్వమే ఏర్పడుతుంది.
 
వారు ఆమోదించినంతకాలం పదేళ్లు, పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళైనా వైసిపి ప్రభుత్వమే ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాల పాటు జ్యోతిబసు ప్రభుత్వమే ఉన్నది.  ఒడిశా లో ఇరవై ఏళ్ళనుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వమే కొనసాగుతున్నది. పవన్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా వరుసగా అయిదుసార్లు పనిచేసారు. ఎన్నికల కమీషన్, కోర్టులు మూడు నాలుగు నెలలు ఆపినంతమాత్రాన అభివృద్ధి ఏమీ ఆగిపోదు.  తరువాతైనా మొదలవుతుంది. అప్పుడు ఎవరు ఆపగలరు?  
 
సూర్యకాంతిని మేఘాలు ఎంతకాలం కప్పగలవు? 
ఇక సుప్రీమ్ కోర్ట్ తీర్పు విషయానికి వస్తే…అక్కడున్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అనే విచక్షణ లేకుండా ఎన్నికల కమీషన్ ఆపితే మా దగ్గరకు రావాలని తీర్పు ఇవ్వడంలో ఏమైనా అర్ధం ఉన్నదా?  ఎన్నికల కమీషనర్ రాష్ట్రప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడని ప్రభుత్వం పట్ల శతృత్వభావంతో పనిచేస్తున్నారని దేశం మొత్తం తెలుసు.  ఆయన పదవీకాలం మరో నాలుగైదు నెలల్లో ముగుస్తుందని తెలుసు.  రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవని తెలుసు.  సంక్షేమ పథకాలకు వందల కోట్లు, వేలకోట్లు ఖర్చు చేసే స్థితి పంచాయితీ, మున్సిపాలిటీలకు లేదని తెలుసు.  అసలు ప్రభుత్వశాఖల మీద స్థానిక సంస్థలకు ఎలాంటి అధికారం, పెత్తనం ఉండదని తెలుసు.  అలాంటపుడు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం వలన ఒనగూరే ప్రయోజనం ఏమిటి?  
 
చంద్రబాబు అక్రమాలను ప్రశ్నించలేదేమి?
గత ఏడాది ఎన్నికలకు కొద్దికాలం ముందు పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ పేర్లతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్ఫయివేలకోట్లు పప్పుబెల్లాల్లా పంచిపెట్టినపుడు ఏ ఎన్నికల సంఘానికి, కోర్టులకు ఓట్లకోసం ప్రలోభపెట్టడంగా అనిపించలేదు. ఎన్నికలకు ఆరు నెలలముందు నిరుద్యోగభృతి పేరుతో వెయ్యి రూపాయలు కొంతమందికి  పంచితే ఏ వ్యవస్థా తప్పు పట్టలేదు. నిష్కర్షగా చెప్పాలంటే చంద్రబాబు చేసింది అక్షరాలా ఓట్ల కొనుగోలు మాత్రమే. ఏమిటో మరి జగన్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అవి నియమాల ఉల్లంఘన కిందనే మన వ్యవస్థల కళ్ళకు కనిపిస్తుంది.  
 
ప్రజాసంక్షేమమే పరమావధి
ప్రజాస్వామ్యంలో అంతిమతీర్పు ప్రజల చేతుల్లోనే ఉంటుందని వ్యవస్థలు గ్రహించకపోతే అవి విలువలు కోల్పోవడం ఖాయం.  ప్రభుత్వం కాళ్ళు చేతులు కట్టేసి అదుపు చెయ్యగలం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.  ఇక్కడ నిమ్మగడ్డ రేమేష్ కుమారో, జగన్మోహన్ రెడ్డో ముఖ్యం కాదు. ప్రజలు ముఖ్యం.  ప్రజాక్షేమం ముఖ్యం.  రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.  నిబంధనల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటే అందుకు మూల్యం చెల్లించేది అమాయక ప్రజలే.  రాజకీయ వైషమ్యాలకు, పక్షపాతంతో ప్రజలు తిరస్కరించినవారికి ప్రయోజనం చేకూర్చాలని వెంపర్లాడటం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాద్రోహానికి తెగించడం వ్యవస్థలకు శాశ్వత కళంకాన్ని తెచ్చిపెడుతుంది.  
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు