హతవిధీ…చివరకు గూగుల్ ఇచ్చిన సమాచారంతో తీర్పా?  

Doubts over Supreme court performance
మనదేశంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో చాలా వ్యవస్థల పనితీరు పట్ల నిరసనలు వ్యక్తం అవుతుంటాయి.  కొన్ని వ్యవస్థల మీద జనానికి నమ్మకం కూడా నశించింది.  అయినా నిస్సహాయులైన పౌరులు ఏమీ చెయ్యలేని దుస్థితి…చిరు విమర్శలు చేసినా కూడా కేసులు పెడతారేమో అన్న భయం! అలాంటి స్థితిలో ప్రజలు విశ్వాసం ఉంచేది న్యాయపాలికపై.  ప్రభుత్వ నిరంకుశ విధానాలను చట్టం, ధర్మం, న్యాయం అనే త్రిశూలంతో పొడిచి అదుపులో పెడుతుందనే ఆశ మిణుకుమిణుకుమంటుంది.  స్వతంత్రం వచ్చాక న్యాయవ్యవస్థ నుంచి అభయం దొరికిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి.  అందుకే మన దేశంలో న్యాయవ్యవస్థ మీద అంతులేని గౌరవం ప్రదర్శిస్తారు.  
 
Doubts over Supreme court performance
Doubts over Supreme court performance

గూగుల్ సమాచారం ఆధారం అవుతుందా?

కానీ, దురదృష్టవశాత్తు గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతికరంగా కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా కొందరు న్యాయమూర్తుల వ్యాఖ్యలు, ప్రజాప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల వారు చేస్తున్న అనుచితమైన ప్రేలాపనలు చూస్తుంటే హైకోర్టు పనితీరు పట్ల దేశవ్యాప్తంగా సందేహాలు పొడసూపుతున్నాయి.   నిన్న  పదవీవిరమణ చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా వ్యవహరించారు.  బెంచ్ మీద కూర్చుని కేసులతో ఏమాత్రం సంబంధం లేని కామెంట్స్ చెయ్యడం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానాన్నే కలవరపరచాయంటే ఇక సామాన్యజనం సంగతి వేరే చెప్పాలా?  మిషన్ బిల్డ్ కేసులో కుర్చీ నుంచి దిగిపోయే ముందు ఆయన ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థకే అతి పెద్ద కళంకంగా చెప్పాలి.  జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకున్న వ్యక్తిగత ద్వేషాన్ని కాలకూటవిషంలా చిమ్మేసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు.  జగన్మోహన్ రెడ్డిని గూర్చి తెలుసుకోవడానికి గూగుల్ వెతికానని, అందులో ఆయన మీద అనేక కేసులు ఉన్నాయని, ఆయన నిందితుడని, సుప్రీంకోర్టు కు లేఖ వ్రాయడం ద్వారా అనుచిత లబ్దిని పొందారని ఆయన తీర్పులో ప్రస్తావించడం చూస్తే అసలు రాకేష్ కుమార్ న్యాయమూర్తి పదవికి అర్హుడేనా అనే సందేహం నిరక్షరకుక్షులకు కూడా కలుగుతుంది.  

సుప్రీమ్ పనితీరు మీద సందేహాలు 

రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పు వలన జగన్మోహన్ రెడ్డికి వాటిల్లబోయే నష్టం ఏమిటోగానీ ఆయన వ్యాఖ్యల కారణంగా న్యాయవ్యవస్థ మీద అనేక సందేహాలు కలుగుతున్నాయి.  సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనుచిత లబ్ది పొందారని, ఆయన రాసిన లేఖ కారణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారని, అందువలన జగన్ మీదున్న సిబిఐ కేసుల విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని రాకేష్ కుమార్ ఆరోపించడం చూస్తుంటే ఆయన న్యాయమూర్తిగా మాట్లాడుతున్నారా లేక ఏదైనా రాజకీయపార్టీ అధికారప్రతినిధిగా మాట్లాడుతున్నారా అనే అనుమానం కలిగితే అది మన దోషం కాదు.  ఆ ఆరోపణలతో సుప్రీమ్ కోర్ట్ పనితీరు మీద కూడా సందేహాలు కలిగేట్లు చేస్తున్నాయి.  ఒక ముఖ్యమంత్రి లేఖ రాస్తే సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులను బదిలీ చేస్తుందా?  లేఖను చూసి అత్యున్నత న్యాయస్థానం ప్రభావితం అవుతుందా? ముఖ్యమంత్రులు ఒక రాష్ట్ర పౌరులుగా మనకు గొప్ప కావచ్చు.  కానీ, సుప్రీమ్ కోర్టు దృష్టిలో  దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో జగన్మోహన్ రెడ్డి ఒకరు.  అంతే తప్ప సుప్రీమ్ కోర్టుకు జగన్ ప్రత్యేక బంధువు కాదు.  చివరకు రాకేష్ కుమార్ ఎంతగా దిగజారిపోయారంటే అత్యున్నతమైన సుప్రీంకోర్టు కొలీజియంను కూడా తప్పు పట్టేంతగా!  ఏదైనా కేసును విచారించవలసింది, ఒక నిర్ణయానికి రావాల్సింది తనముందున్న సాక్ష్యాలను, ఆధారాలను, తన విచక్షణను, తన మేధస్సును ఆలంబనగా చేసుకుని తప్ప గూగుల్ లో దొరికే సమాచారం ఆధారంగానా?  హవ్వ!  

రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో చొరబడటం ఏమిటి?

శాసనమండలిని రద్దు చెయ్యడం, మూడు రాజధానుల ప్రతిపాదన, ఇంగ్లిష్ మీడియం బోధనా…ఇలా ఒకటేమిటి.. ఆయన విచారిస్తున్న కేసుతో ఏమాత్రం సంబంధం లేని సమస్త అంశాలను తీర్పులో జొప్పించి న్యాయవ్యవస్థనే అపహాస్యం పాలు చేశారు. శాసనమండలిని రద్దు చేయడం, పునరుద్ధరించడం అది రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలోనివి.  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దుకు సిఫార్స్ చేశారు.  రద్దు చేయించారు.  వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు.  అది ప్రభుత్వ చిత్తమే కానీ, న్యాయస్థానం అధికారం కాదు.  అలాగే రాజధానులు ఎన్ని ఏర్పరచుకోవాలో అనేది రాష్ట్రం ఇష్టం, కేంద్రానికి సంబంధం లేదు అని కేంద్రప్రభుత్వం కూడా మూడుసార్లు అఫిడవిట్ దాఖలు చేశాక కూడా మండలి రద్దు అనేది రాజ్యంగద్రోహం, జగన్ మోహన్ రెడ్డి నిరంకుశత్వం అన్నట్లు రాకేష్ కుమార్ వ్యాఖ్యలు చెయ్యడం ఆయన   వ్యక్తిగత రాగద్వేషాలను బయల్పరచింది.   పైగా మిషన్ బిల్డ్ కేసులో ఇచ్చిన  తీర్పులో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లు ప్రత్యేకంగా ఉటంకించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, అధికారాలను చెరబట్టడానికి బరితెగించారు.  పదవీ విరమణ చేయబోయే నెలరోజుల ముందు సుప్రీమ్ కోర్టుతో అక్షింతలు వేయించుకుని, ప్రజాస్వామ్యరక్షకుడని పచ్చమీడియా చేసే భజనలను బాగా వంటబట్టించుకుని తానేదో అవతారపురుషుడిని అన్న భ్రమల్లో మునిగి తన విధినిర్వహణకు తీరని అపచారం చేశారు.   జస్టిస్ రాకేష్ కుమార్ ఒక రాజకీయపార్టీకి, ఒక సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి ప్రభావానికి లోనై తన విధులకు ద్రోహం చేశారనడంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు.        రాకేష్ కుమార్ కోర్ట్ ధిక్కారానికి పాల్పడ్డారనడంలో సందేహమే లేదు.   ఆయన శైలిని సుమోటోగా తీసుకుని సుప్రీమ్ కోర్టు విచారించాలి.  న్యాయవ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించాలి. 

న్యాయమూర్తి పదవికి అనర్హుడు 

జస్టిస్ రాకేష్ కుమార్ శైలి ఎలా ఉన్నదంటే ఒక నాయకుడు ఒక పార్టీలో అనేక పదవులు అనుభవించి, అవినీతికి పాల్పడి, ఆ సమాచారం తెలిసిన పార్టీ అధినాయకుడు సస్పెండ్ చేయబోతున్నారని తెలిశాక హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి నాయకుడిమీద అవినీతి ఆరోపణలు చేస్తూ కడివెడు విషం కుమ్మరించి వెళ్లి వేరే పార్టీలో చేరె రాజకీయ నాయకుడిలా ఉన్నది తప్ప ఒక హుందాతనం కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేదు.   నెమలి ఈకలు తెచ్చి తగిలించినంతమాత్రాన కాకికి అందం వస్తుందా?  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు