దేశంలో మహిళలు, పసి పిల్లలపై లైంగిక దాడులు, హత్యలు జరిగినప్పుడు అయా ప్రభుత్వాలు, పార్టీలు, మహిళా సంఘాలు, మీడియా స్పందించే తీరులోనూ సామాజిక వివక్ష కొనసాగుతున్నది. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు సమాజంలో అందిరిని ఒకే కోణంలో చూడడం లేదు. అణగారిన వర్గాలకు చెందిన మహిళలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా, ఉన్నత వర్గాలపై జరిగినప్పుడు మరో రకంగా పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియా స్పందిస్తున్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ (14-16)లో కుల, మత, జాతి, లింగ, వర్ణ భేదం లేకుండా అందిరికీ సమ న్యాయం కల్పించాలని పేర్కొన్నారు. కానీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు అడుగడునా భంగం కల్గుతున్నది. దేశంలో జరిగిన సంఘటనల తీరు చూస్తే అర్థమౌతుంది. 2012వ సంవత్సరం డిసెంబర్ 16న ఢిల్లీ పరిసరాల్లో నిర్భయ (జ్యోతి సింగ్) పాండే అనే అగ్రవర్ణాలకు చెందిన యువతిని నలుగురు యువకులు అతికిరాతంగా రేప్ చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా తదితర మాద్యమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమ ఫలితమే పార్లమెంటులో నిర్భయ చట్టం చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఢిల్లీలో నడిబోడ్డున దళిత యువతిని క్యాబ్ లో గ్యాంగ్ రేప్ చేశారు. కానీ దానిపై పెద్దగా స్పందించిన దాఖలాల్లేవు.
ఇక ఉత్తర ప్రదేశ్ లో ఉన్నావ్ లో 2017వ సంవత్సరంలో జూన్ 4వ తేదీన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగ్వార్, అతని సోదరులు దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ సంఘటన పై ఏడాది కాలం పాటు పోలీసులు పట్టించుకోలేదు. చివరకు దళిత సంఘాల పోరాటంతో సీబీఐ దర్యాప్తు చేసింది. కానీ దర్యాప్తు పూర్తి కాకుండానే 2018 ఏప్రిల్ లో బాలిక తండ్రిని పోలీసు కస్టడిలోనే చంపేశారు. అనంతరం ఇదే ఏడాది జూలై 28న బంధువులతో కలిసి బాధితురాలు అటోలో వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి చంపేసిన విషయం తెలిసింది. ఉన్నావ్ జిల్లాల్లోనే బుధవారం లైంగిక దాడికి గురైన బాలిక కోర్టు విచారణలో భాగంగా వెళ్తుండగా, గ్రామ శివారులో కాపు కాసి బాధితురాలికి నిప్పంటించారు. శరీరం 70శాతం కాలిపోవడంతో ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నది. ఇలా ప్రతి రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో దళిత, గిరిజన యువతులపై రేప్ లు, గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వంగానీ, రాజకీయ పార్టీలు, మీడియాగానీ పెద్దగా స్పందించడం లేదు. బీఎస్పీ పార్టీకి చెందిన కార్యకర్తలు నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా తక్కువ. ఇదే పద్దతిలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ స్పందించంలో సామాజిక కోణంలోనే ఆలోచిస్తున్నట్లు అర్థమౌతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా అందిరికీ సమాన న్యాయం దక్కడం లేదని తెలుస్తుంది. అందరూ ఆడపిల్లలు అందరివి ఒకే రకమైన సంఘటనలే. కానీ ప్రభుత్వం తీసుకునే చర్యలు తీరు వేర్వేరుగా ఉంటుంది. దీన్నిబట్టి సామాజిక న్యాయంపై కూడా చర్చ జరగాల్సిన అవసరముంది.
ఇక గతవారంలో జరిగిన తెలంగాణలో ప్రియాంకరెడ్డిపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి, ఆపై అతి కిరాతంగా హత్య చేసి చంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు వరంగల్ లో యాదవ సామాజిక వర్గానికి చెందిన మానస పై నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేసి హత్య చేశారు. అంతకు రెండు రోజుల ముందు కోమురంబీమ్ జిల్లాలో టేకు లక్ష్మిని నలుగురు యువకులు అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపారు. ఈమె ఊరూరు తిరిగి ఆట బొమ్మలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. తెలంగాణలోనే మూడు రోజుల్లోనే ముగ్గురు యువతులు గ్యాంగ్ రేప్ కు గురైతే ప్రియాంకరెడ్డి సంఘటననే మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. కానీ మిగతా ఇద్దరి గురించి ప్రపంచానికి తెలియలేదు. మీడియా ఫోకస్ లేదు. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగంగానీ, రాజకీయ పార్టీలు నాయకులుగానీ, ప్రజా సంఘాలుగానీ ఈ సంఘటనల గురించి ప్రస్తావించలేదు. కనీసం బాధిత కుటుంబాలకు పరామర్శలు చేయలేదు. ఇలాంటి చర్యలనే సామాజిక వివక్షగా అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా అణగారిన కులానికి చెందిన యువతులు కులాంతర వివాహలు చేసుకున్నప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో కోకోల్లాలుగా ఉన్నట్లు సమాచారం. ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా అందిరికీ అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.