నేలకొరిగిన ద్రవిడ మహావృక్షం… ప్రస్థానం

కరుణానిధి ఒక పేద ఇసాయి వెల్లలార్ (ఒక బీసీ మంగలి  కులం) కుటుంబంలో జూన్ 3, 1924 లో పూర్వపు తంజావూరు జిల్లాలోని తిరుక్కువలై అనే చిన్న పల్లెటూళ్ళో జన్మించారు.  తన తల్లిదండ్రులు ముతువెల్ మరియు అంజుగం తముకున్న దైవభక్తి చేత కరుణానిధి కి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు.

యుక్త వయస్సులో  పెరియార్ రామస్వామి మరియు అన్న నేతృత్వంలోని ద్రావిడ ఉద్యమం  పట్ల ఆకర్షితుడై ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం, తమిళనాడులో ద్రావిడ ఉద్యమానికి మరియు డిఎంకె పెరుగుదలకి ప్రధాన పాత్ర పోషించిన కళ, సాహిత్యం, ఫ్యాషన్ థియేటర్ మరియు సినిమాల్లో కరుణానిధి చూపిన నైపుణ్యానికి కళైన్జర్ అనే బిరుదు కూడా తన సొంతం అయ్యింది .

1957 లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలలో కులితలై నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  పోటీచేసి జయకేతనం ఎగురవేశారు. . అప్పటినుంచి ఆయన వరుసగా 13 సార్లు అసెంబ్లీకి పోటీపడ్డారు . 1962 లో తంజావూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1967 నియోజకవర్గాన్ని తిరువారూర్ కు మార్చారు.  2016 లో కూడా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు.  పోటీచేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి ఎరగని అతికొద్ది మంది నేతల్లో ఒకరుగా నిలిచిపోయారు .

అన్నాదురై తో కరుణానిధి

1967 ఎన్నికలలో డిఎంకె గెలిచిన తర్వాత అన్నాదురై  మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు . అప్పటినుండి అయన దిశ తిరిగిందని చెప్పాలి .

1969 లో అన్న మరణం తరువాత, కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అతను 1971 లో తిరిగి   డిఎంకె ని అత్యధిక మెజారిటీ తో విజయపథంలో నడిపించారు.

సినిమా హీరో, పార్టీ నాయకుడు ఎం.జి.ఆర్ తనకు భవిష్యత్ ముప్పుగా ఉన్నట్లు తెలుసుకున్న కరుణానిధి అతనిని పక్కన పెట్టటం ప్రారంభించారు .  ఆ క్రమంలో 1972 లో ఎం.జి.ఆర్ ని పార్టీ నుండి తొలగించారు. ఎఐడిఎంకె   అనే వేరు కుంపటి పెట్టిన ఎం.జి.ఆర్ని  1977 లో విజయం వరించింది . కాంగ్రెస్ తో స్నేహం చేసిన  ఎం.జి.ఆర్ చాకచక్యంగా డీఎంకేను  పదేళ్లు పాటు ప్రతిపక్షానికి పరిమితం చేసారు .  

1989 లో ఎం.జి.ఆర్ మరణంతో డిఎంకె  మళ్లీ అదృష్టం వరించింది. ఎఐడిఎంకె జానకి రామచంద్రన్ మరియు జయలలిత వర్గాలుగా చీలిపోవడంతో డీఎంకే తిరిగి అధికారంలోకి రాగలిగింది .

1991 లో, ఎల్ టిటిఇ  కార్యక్రమాలు ఎక్కువగా వున్నాయన్న  నెపంతో కరుణానిధి సర్కారు రద్దయింది. రాజీవ్ హత్య అనంతరం 1991 లో జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని ఎఐడిఎంకె  తిరిగి అధికారంలోకి వచ్చింది .

1993 లో మంచి వాక్పటిమ కలిగిన వైకోను  తన కుమారుడు ఎం.కె స్టాలిన్ కి ముప్పుగా భావించిన కరుణానిధి పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడంతో  డిఎంకె రెండో చీలికను ఎదుర్కొంది. క్రమంగా స్టాలిన్ పార్టీ లో తన ప్రాధాన్యతను పెంచుకుంటూ ఉపముఖ్యమంత్రి స్థానానికి ఎదిగారు

1996 లో జరిగిన ఎన్నికల్లో జయలలిత మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి డీఎంకే  కి  విజయం సాధించిపెట్టారు. అప్పటినుండి అధికారం ఐదేళ్లకొకసారి ఎఐడిఎంకె మరియు డిఎంకెమధ్య మారుతూ వచ్చింది .

తొలిసారి ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తున్న కరుణానిధి

2016 లో మాత్రం జయలలిత అనూహ్యంగా వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. ఇది  కొడుకు స్టాలిన్ ని ముఖ్యమంత్రి గా చూడాలనుకున్న ‘కళై ణార్’ కరుణానిధిని తీవ్ర నిరాశకు గురి చేసింది .  .

ఏదిఏమైనప్పటి ఒక అర్ధశతాబ్దం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా అదే కాలంలో ఒక పార్టీ అధ్యక్షడుగా కొనసాగడం తో పాటు ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం అంత సామాన్యమైన విషయమేమి కాదు .

ద్రావిడ ఉద్యమంతో పాటు తమిళ వాణిని గట్టిగ వినిపించిన నాయకుడిని కోల్పవడం తమిళనాడు కి ఈ దేశానికి తీవ్రమైన లోటు అని చెప్పక తప్పదు . కాలధర్మం ముందు పర్వతమైన తలవంచాల్సిందే అని సరిపెట్టుకోవడమే ….