తమిళ సినిమా స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో తన సామాజిక దృష్టిని స్పష్టంగా చెప్పకున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కారం చేస్తూ, విజయ్ స్పందించిన మాటలు ఇప్పుడు యువతలో చైతన్యం రేపుతున్నాయి. విజయ్ తన ప్రసంగాన్ని “ప్రకృతికి కులం ఉందా? మతం ఉందా?” అనే ప్రశ్నతో ప్రారంభించారు. ఈ ప్రశ్నతోనే ఆయన తన సందేశాన్ని స్పష్టంగా వ్యక్తపరిచారు.
విజయ్ తన ప్రసంగంలో యువతను తాత్కాలిక ఆశక్తులు, విభజనల వైపు దారి తీసే అంశాల నుండి విముక్తిపరచాలన్న లక్ష్యంతో మాట్లాడారు. “డ్రగ్స్‌ను ఎలాగైతే తగిన దూరంలో ఉంచుతారో, అలా కులం, మతం పేరుతో వచ్చే విషపు వాతావరణాన్ని కూడా దూరంగా ఉంచాలి” అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అందరికి సమానమైన అవకాశాలు కల్పించదని, నిజమైన విలువలు తెలిసిన వ్యక్తులకే ఓటు వేయాలని విద్యార్థులకు సూచించారు. తాను నటుడిగానే కాకుండా ఓ ప్రజానాయకుడిగా భావిస్తున్న విజయ్.. తన అభిప్రాయాలను ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిస్తున్న తీరు ఈ ప్రసంగంలో బలంగా కనిపించింది.
ఈ వ్యాఖ్యలు రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విజయ్ తన రాజకీయ రంగప్రవేశాన్ని బలంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పటికే డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆయన, బీజేపీ పై కూడా విమర్శలతో తన వైఖరిని చూపిస్తున్నారు. ఆయన స్పష్టమైన పదజాలం, ప్రజలలో చైతన్యాన్ని రేకెత్తించే శైలితో చేసిన ఈ ప్రసంగం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుల, మత అంశాలపై పోరాటం చేస్తూ విజయ్ పెట్టిన పిలుపు రాజకీయాలకు అందిన నూతన దిశగా భావిస్తున్నారు విశ్లేషకులు.