తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపు తెచ్చిన.. టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. మధురైలో నిర్వహించిన రెండో భారీ బహిరంగ సభలో ఆయన ఆవేశభరిత ప్రసంగం చేశారు. విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను ఎంత విమర్శిస్తే అంతగా ఎదుగుతా అంటూ జనసమూహాన్ని ఉత్సాహపరిచారు. తన రెండో బహిరంగ సభలోనే విజయ్ కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇది ఒక సాధారణ ఎన్నిక కాదని.. ఇది ఒక విప్లవం అని ధీమాగా చెప్పారు. కులం, మతం అన్న విభజనల్ని పక్కన పెట్టి తమిళుడికే ప్రాధాన్యం ఇవ్వడం టీవీకే పార్టీ ధ్యేయమని తెలియజేశారు.
రాజకీయ సమీకరణాలపై కూడా విజయ్ స్పష్టత ఇచ్చారు. బీజేపీని భావజాల శత్రువుగా పేర్కొంటూ, ఎలాంటి పొత్తులకూ తావులేదని తేల్చి చెప్పారు. కొన్ని పార్టీలు మనుగడ కోసం కూటములు కడతాయని.. కానీ మేము ఎప్పటికీ ఆరెస్సెస్ ముందు తలవంచని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమిళ అస్తిత్వాన్ని బలహీనపరచే శక్తులపై నిరంతర పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
డీఎంకేనే ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందని విజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ డీఎంకే.. టీవీకే మధ్యే ఉంటుందన్నారు. ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రజల మనసు గెలుస్తామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించిన విజయ్, రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ అంశంపై కూడా విజయ్ తన వైఖరిని వెల్లడించారు. శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చతీవును తిరిగి తమిళులకు అందించడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ప్రజల హక్కుల కోసం తన పార్టీ అంకితభావంతో పని చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. టీవీకే స్థాపన తర్వాత ఇది విజయ్ రెండో మహాసభ. తొలి సభ విల్లుపురం జిల్లా విక్రవందిలో జరగగా, ఈసారి మధురైలో అభిమానులు, కార్యకర్తల సమూహం ఆయనకు ఘన స్వాగతం పలికింది. నినాదాలతో మార్మోగిన వేదికలో విజయ్ వాగ్దానాలు, సవాళ్లు, ఆవేశభరిత ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
