Trisha: ఆలయానికి ఏనుగును బహుమతిగా ఇచ్చిన త్రిష.. దాని ప్రత్యేకతల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Trisha: తెలుగు ప్రేక్షకులకు చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రిష పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. 40 ఏళ్ల వయసులో కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది త్రిష. ప్రస్తుతం తమిళం తెలుగు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా వయసుతోపాటు తన అందాన్ని మరింత పెంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటిస్తోంది.

కాగా ఇటీవల అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ చిత్రాల్లో నటించి మెప్పించింది త్రిష. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది త్రిష. ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష చేసిన పనికి అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాగా జంతు సంక్షేమ కార్యకర్త కూడా అయిన త్రిష మూగజీవాలపై ఎంతో కరుణ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె ఒక ఆలయానికి నిజమైన ఏనుగుకు బదులు రోబో ఏనుగుని బహూకరించి వార్తల్లో నిలిచారు.

తమిళనాడులోని అరప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్ట లింగ ఆదిశేష సెల్వ వినయగర్, శ్రీ అష్ట భుజ ఆదిశేష వరాహి అమ్మన్ ఆలయాలకు ఒక రోబో ఏనుగును త్రిష బహుమతిగా ఇచ్చింది. పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె ఈ ఏనుగును తయారు చేయించారు. హిందూ ఆలయాల సంప్రదాయాలను గౌరవిస్తూనే నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ మెకానికల్ ఏనుగును బహూకరించినట్లు త్రిష చెబుతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ ఏనుగును ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. గజ అనే పేరుగల ఈ రోబో ఎలిఫెంట్ 3 మీటర్ల పొడవు, 800 కిలోల బరువుతో నిజమైన ఏనుగులాగే ఉంటుంది. చక్రాల సాయంతో నడుస్తూనే భక్తులపై నీళ్లు చల్లుతుంది. తల, చెవులు ఊపుతుంది. దీని తయారు చేసేందుకు రూ.6 లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ ఏనుగును ఉత్సవాలు, వేడుకల సమయంలో ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రోబో ఎలిఫెంట్‌ కి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.