కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్టే!

మొన్నటివరకు జగన్ పార్టీ ఎలాంటి అవకరాలకు పాల్పడిందో ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి అదే తప్పులు చేస్తోంది.

ఔను..దాడులు.. దుందుడుకు చర్యలు.. ఇవన్నీ ఇప్పుడు కూటమి నిత్యకార్యకలాపాలుగా మారిపోయాయి.

మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన ఉత్తర క్షణం నుంచే కూటమి కార్యకర్తల హల్చల్ మొదలైపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనే లేదు. ప్రభుత్వం వచ్చాక క్యాబినెట్ స్థాయిలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను కార్యకర్తలే తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేసేసారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం బోర్డును మార్చేశారు.. మూకుమ్మడిగా దాడి చేసినట్టు.. జరిగింది ఇదంతా..

నిజానికి ఇలాంటి దుందుడుకు చర్యలు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు.

అలాగే విజయనగరంలోని జిల్లా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి బోర్డు మార్పు కూడా. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఆస్పత్రి పేరును మహరాజా ఆస్పత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చారు. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇంకా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక మునుపే తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఒక దొమ్మి మాదిరి ఆస్పత్రికి వెళ్లి ఉన్న బోర్డు తొలగించి మహారాజా ఆస్పత్రి అనే బోర్డును మళ్ళీ తగిలించేసారు.

ఇవి గాక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు.. కార్యకర్తల ఇళ్లపై దాడులు.. వైసీపీ పార్టీ కార్యాలయాల ధ్వంసం వంటి దుందుడుకు చర్యలకు టిడిపి.. జనసేన కార్యకర్తలు పాల్పడడం చూసి జనాలు నివ్వెరపోయారు.

ఇప్పుడు విశాఖలో డక్కన్ క్రానికల్ కార్యాలయంపై బుధవారం నాడు జరిగిన దాడి ఘటన కూటమి కార్యకర్తల దాష్టీకానికి అద్దం పట్టింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి టిడిపి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్టు క్రానికల్ పత్రికలో వచ్చిన వార్త ఈ దాడికి మూలం. పెద్ద సంఖ్యలో మూకలు విశాఖ క్రానికల్ కార్యాలయంపై దాడి జరిపి విధ్వంసం సృష్టించారు. ఇది అత్యంత ఆక్షేపనీయ చర్య. పత్రికా స్వేచ్ఛకు విఘ్నం కలిగించే దాడి. ఏ వర్గం కూడా ఆమోదించని విషయం. కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్టే..!