రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వెర్సెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్లో రోజుకో మలుపు, ప్రతి మలుపులో కొత్త సందేహాలు. మొదటి నుండి ఈ వివాదాన్ని గమనిస్తున్న ప్రజల్లో ఈ పోరులో రఘురామరాజు గెలుస్తారా లేకపోతే వైకాపా పైచేయి సాధిస్తుందా అనే అసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. రాఘురామరాజు తాను పార్టీని వీడనని, తనపై అనర్హత వేటు వేసే వీలు లేదని అంటూ ఢిల్లీ పెద్దలను కలిశారు, తనపై అనర్హత వేటు వేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. దీన్నిబట్టి ఆయన న్యాయ పోరాటానికైనా సిద్దమని అర్థమవుతోంది. ఇక వైకాపా కూడా వెనక్కి తగ్గాట్లేదు. మొదట్లో హెచ్చరించి వదిలేద్దామని అనుకున్నా షోకాజ్ నోటీసుల అనంతర పరిణామాలతో వేటు వేసి తీరాలని గట్టిగా డిసైడ్ అయింది.
అందుకే ఈరోజు విజయసాయిరెడ్డితో పాటు నందిగామ సురేష్, లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, మిథున్‌రెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వీరంతా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, సొంత పార్టీకే ద్రోహం చేస్తున్నారని, ప్రతిపక్షాలతో చేతులు కలుపుతున్నారని, అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేయాలని అంటూ ఆయన మీద అనర్హత వేటు వేసేలా స్పీకర్ వద్ద హామీ తీసుకున్నామని మాట్లాడారు. వీళ్ల మాటలన్నీ వింటే రఘురామరాజు అనే వ్యక్తిని కేవలం వైకాపా ఎంపీగా చూస్తున్నారు తప్ప ప్రజలు ఎన్నుకున్న లోక్ సభ సభ్యుడిగా చూడలేకపోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈరకమైన దృష్టి కోణంలోనే వైకాపా నేతల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాఘురామరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారే తప్ప ఆయన రాజ్యాంగాన్ని అనుసరించే మాట్లాడుతున్నారని గ్రహించలేకపోతున్నారు. ఏ ఎంపీ మీదైనా అనర్హత వేటు వేయాలి అంటే ఆ ఎంపీ పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండాలి. ఏదైనా రాజ్యాంగబద్దమైన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వేరే రాజకీయ పార్టీలతో కుమ్మక్కై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేస్తే స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయవచ్చు. అంతేకానీ విప్ జారీ కాని పార్టీ అభిప్రాయాలపై వ్యతిరేకత వ్యక్తపరచవచ్చు. అందుకే విప్ ను దిక్కరిస్తేనే అనర్హత వేటు అన్నారు.
పైగా పార్లమెంట్ సభ్యుడు ఎల్లప్పుడూ రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే మెలగాలనే రూల్ కూడా లేదు. వారికీ భావప్రకటనా స్వేచ్చ అనేది రాజ్యాంగంలో ఉంది. ఆ ప్రకారమే రాఘురామరాజు వైకాపా తీసుకున్న ఇంగ్లీష్ మీడియంలోనే బోధన, టీటీసీ ఆస్తుల విక్రయం, ఇసుక అక్రమాలు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వంటి వాటిని వ్యతిరేకించారు. పైగా అవేవీ చట్టాలు కాదు, బిల్లులూ కాదు. వాటి విప్ లాంటివి కూడా లేవు. అలాంటప్పుడు ఆయన మీద అనర్హత వేటు వేయడం అసాధ్యం. ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేసేది ప్రజల ప్రతినిధిగానే తప్ప రాజకీయ పార్టీకి మనిషిగా కాదు. అలాంటప్పుడు రాజకీయమా, రాజ్యాంగమా అనే మీమాంస వస్తే రాజ్యాంగంవైపే మొగ్గుచూపడం సమంజసమే.
Read More : ఆ యువనిర్మాత పంథా అస్సలు బాలేదు
ఇప్పుడు రఘురామరాజు చేసింది కూడా అదే. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన జవాబులో కూడా రాజ్యాంగబద్దంగానే మాట్లాడనని అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా వైకాపా అధిష్టానం ఆయన మీద ఏదో ఒక రకంగా పంతం నెగ్గించుకోవాలి అనుకుంటే మహా అయితే క్రమశిక్షణా చర్యల ద్వారా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించారనే కారణం చూపుతూ పార్టీ నుండి బహిష్కరించవచ్చేమో కానీ ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవి మీద మాత్రం అనర్హత వేటు వేయలేరు. ఒకవేళ పార్టీ నుండి బహిష్కరిస్తే రఘురామరాజు ఎంచక్కా ఎంపీ పదవిని చేతిలో పెట్టుకుని ఎలాంటి అద్దంకులూ, ఆక్షేపణలు లేకుండా తనకిష్టమైన భాజపాలోకి వెళ్లిపోతారు. అప్పుడిక ఆయన మీద పార్టీ పిరాయింపుల చట్టం కింద కూడా చర్యలు తీసుకునే హక్కును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది.