ఒక నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించాలంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండాలి? ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల మీద ప్రజలకు వ్యతిరేక భావం ఉండాలి. అవినీతి, అసమర్ధతలు రాజ్యమేలుతుండాలి. క్లీన్ రికార్డ్ కలిగిన సాహసవంతుడికోసం ప్రజలు ఎదురు చూస్తుండాలి. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడి ఉండాలి. అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తుంటాయి. 1980 వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అవినీతి, లంచగొండితనం, ఆత్మగౌరవలేమి, మొదలైన అంశాలను ఉపయోగించుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘనవిజయాన్ని సాధించారు.
చిరంజీవి తప్పుడు నిర్ణయం
ఆ తరువాత మళ్ళీ 2002 ప్రాంతంలో మరొకసారి రాజకీయ శూన్యత ఆవరించింది. చంద్రబాబు పరిపాలన నరకానికి నకలుగా, దోపిడీదొంగల రాజ్యంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత తన్నులాటలు, తగాదాలు, ఒకరినొకరు ద్వేషించుకోవడం లాంటి అవలక్షణాలతో చచ్చుబడి ఉంది. ఆ పరిస్థితుల్లో అప్పటి మెగాస్టార్ చిరంజీవి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలని తలచారు. కానీ, ఆయన బలహీనతలు బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు జూబిలీ హిల్స్ లో రెండు ఎకరాలో ఒక ఎకరమో స్థలం ఉచితంగా ఇవ్వడంతో చిరంజీవి చప్పబడిపోయారని ఆనాడు కొందరు విమర్శించారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రభావం కారణంగా రాజకీయాశూన్యత భర్తీ అయిపోయి రాష్ట్రాధినేత అయ్యే సువర్ణావకాశాన్ని చిరంజీవి జారవిడుచుకున్నారు.
చిరంజీవి మరొక తప్పుడు నిర్ణయం
2009 వచ్చేనాటికి వైఎస్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సువర్ణాక్షరాలతో అందించదగిన పాలన అందించి వైఎస్ వ్యక్తిగత ప్రతిష్ట ఆకాశమెత్తున పెరిగింది. అధికారపక్షం మీద సహజంగా పెరిగే కొంత వ్యతిరేకతతో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా కొంచెం బలాన్ని పెంచుకుంది. రాజకీయ శూన్యత అనేది లేదు. ఆ సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆఫ్ కోర్స్…ఆయన పార్టీ రాజశేఖరరెడ్డి ప్రాయోజిత పార్టీ అనే అపనిందలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయతెరపై అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన పార్టీని నడపలేక దుకాణాన్ని హోల్సేల్ గా సోనియాగాంధీకి అమ్మేసుకుని ఆమె పాదాలవద్ద సేదదీరి అపఖ్యాతి పాలైపోయారు. ఆయనను నమ్మి పెట్టుబడులు పెట్టినవారంతా నట్టేట మునిగిపోయారు.
మోసపోయిన పవన్ కళ్యాణ్
2014 నాటికి రాష్ట్రం చీలిపోయింది. తెలుగుదేశం పార్టీ వరుస ఓటములతో కుదేలై ఉంది. వైసిపి బలంగా ఉన్నది. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఆవరించి ఉంది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి జనసేన అనే పార్టీని స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నట్లయితే వైసిపి అధికారంలోకి వచ్చి జనసేన బలమైన ప్రతిపక్షంగా ఎదిగేది. కానీ ఆ సువర్ణావకాశాన్ని పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ సభ్యత్వానికి, చంద్రబాబు ఇచ్చిన పాకేజికి కక్కుర్తి పడి చేతులారా నాశనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మేము ఆరువందల కోట్ల రూపాయల ప్యాకేజి ఇచ్చామని నాటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తే నమ్మి ఎన్నికల్లో పోటీ చెయ్యలేదని పవన్ కళ్యాణ్ కూడా పబ్లిగ్గానే ప్రకటించాడు.
బొక్కబోర్లా పడిన పవన్ కళ్యాణ్
ఇక 2019 వచ్చేసరికి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలన వైసిపి అనూహ్యరీతిలో పుంజుకుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నది. ఈ రెండు పార్టీల మధ్య ఓటు బ్యాంకు స్పష్టంగా చీలి ఉన్నది. దాదాపు తొంభై శాతం ఈ రెండు పార్టీల ఖాతాల్లోనే జమ అయింది. రాష్ట్రంలో లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. రాజకీయ శూన్యత అనేది లేదు. మరోపార్టీకి స్థానం లేదు. అలాంటి సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు కూడా తెచ్చుకోకుండా ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా తిరస్కరించబడ్డాడు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎంపీ స్థానానికి పోటీ చేస్తే ప్రజలు ఓడించారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అతని రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది.
వెనక్కు తగ్గిన రజనీకాంత్
ఇక తమిళనాట రజనీకాంత్ విషయానికి వస్తే గత పాతికేళ్లుగా ఆయన రాజకీయ పార్టీ స్థాపన విషయంలో ఎన్నిసార్లు యూ టర్న్ తీసుకున్నాడో ఆయనకే గుర్తుండి ఉండదు. సినిమారంగంలో ఆయన సూపర్ స్టార్. దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమాన ప్రేక్షకులను కలిగి ఉన్న ఏకైక హీరోగా చెప్పొచ్చు. నిజానికి ఆయన రాజకీయప్రవేశం చెయ్యడానికి అతి ముఖ్యమైన అర్హత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. కానీ ఆయన దురదృష్టం ఏమిటంటే తమిళనాడులో గత యాభై ఏళ్లుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు బలమైన పక్షాలుగా ఉన్నాయి. గత యాభై ఏళ్లలో ఆ రెండు పార్టీల మధ్యనే అధికారలక్ష్మి సంచరిస్తున్నది. కరుణానిధి, జయలలిత ఆ రెండు పార్టీలకు సారధులుగా పార్టీలను ప్రజాజీవితాలతో మమేకం చేశారు. మరొక సూపర్ స్టార్ విజయకాంత్ కూడా ఒక పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా, ఆయనకు విజయకాంతులు దక్కలేదు. కారణం ఏమంటే అక్కడ రాజకీయ శూన్యత లేదు.
అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయపార్టీని పెట్టుకున్నప్పటికీ దానికి ఆదరణ దక్కడం అసాధ్యం. పైగా రజనీకాంత్ వయస్సు, ఆరోగ్యం రాజకీయపార్టీని నడపడానికి సహకరించే పరిస్థితి లేదు. రాజకీయపార్టీ పెడితే ఇరవైనాలుగు గంటలు ప్రజలమధ్యలో దూసుకుని వెళ్ళాలి. రోడ్ షోలు నిర్వహించాలి. అభిమానులు మీద పడతారు. పైగా రజనీని నమ్మి పెట్టుబడులు పెట్టేవారు కావాలి. స్టాలిన్, శశికళ, పళనిసామి లాంటి యోధాగ్రేసరులకు వ్యతిరేకంగా రజనీని సమర్ధించడానికి పెట్టుబడిదారులు సాహసిస్తారు అనేది కలలోని మాట. అందులో తమిళ రాజకీయాలు ప్రతీకారంతో కూడుకుని ఉంటాయి. రజనీకాంత్ పార్టీ గెలవని పక్షంలో ఆయనను సమర్ధించిన పారిశ్రామికవేత్తతలు అందరూ తమిళనాడును వదిలి పారిపోవాల్సివస్తుంది. రజనీ తన కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెడితే అది నాలుగు నెలలు కూడా సరిపోదు. తీరా ఓడిపోతే రజనీకాంత్ గతి ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు.
బీజేపీ హస్తం ఉన్నదా?
ఇక అనేకమార్లు పార్టీ పెడతానని వెనక్కు తగ్గడంతో రజనీకాంత్ అంతరంగం ఏమైనప్పటికీ, నిన్నటి ఆయన ప్రకటన వెనుక కేంద్రంనుంచి ఒక ప్రముఖ తెలుగు బీజేపీ నాయకుడి సలహా ఉన్నదని, ఆయన సలహా మేరకే బీపీ సాకుతో రజనీ అపోలో ఆసుపత్రిలో చేరారని ఒక వార్త. మరొకటేమిటంటే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా ఇరవై సీట్లకంటే వచ్చే అవకాశం లేదని రజనీ సొంతంగా చేయించుకున్న సర్వేలో తేలిందట. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో దూరి డెబ్బై ఏళ్ళవయసులో అందరికి శత్రువుగా మారి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కోల్పోవడం కంటే అభిమానులకో క్షమాపణ చెప్పి ఇంట్లో కూర్చోవడం ఉత్తమం అని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా రజనీ తీసుకున్న నిర్ణయం సమంజసమే. రాజ్యం వీరభోజ్యమే కానీ, భీరువులకు తగినది కాదని పెద్దల వాక్కు. అందరూ ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి సాహసవంతులు కాలేరు కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు