ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కిపోతున్నాయి. ఈ సమయంలో ఎవరి భయాలు వారి కుంటే.. ఎవరి నమ్మకాలు వారికున్నాయి. ఫలితంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోకి దిగిపోయాయి. ఎవరి బలం ఉన్న చోట వారు ఓటర్లను రిక్వస్ట్ చేసుకోవడం మొదలుపెట్టేశారు.
తనకు గోదావరి జిల్లాల్లోనే అత్యధిక బలం ఉందని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్… వారహి యాత్ర చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం నుంచి మొదలుపెట్టి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వరకూ తొలివిడత ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవడూ ఆపలేడని జనసేన పార్టీ అధ్యక్షుడు చెబుతున్నారు.
ఇక ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం కుప్పంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఫిక్స్ అయిన వేళ.. చంద్రబాబు అలర్ట్ అయ్యారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు. ఇందులో భాగంగా కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా.. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు అక్కడికి పరుగెత్తుతున్నారు.
9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఐదేళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉండే అవకాశాన్ని కల్పించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదనే విషయాన్ని కుప్పం ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ తినాల్సి వచ్చింది. ఫలితంగా బాబుకు కొత్త బెంగ స్టార్ట్ అయ్యింది. దీంతో.. వీలు కుదిరినప్పుడల్లా కుప్పంలో వాలిపోతున్నారు.
సాధారణంగా ఏ పార్టీ అధ్యక్షుడైనా.. పార్టీ బలంగా ఉన్నచోట కాస్త తక్కువ శ్రద్ధ పెడతారు.. బలంగా లేని చోట్ల ఒకటికి రెండు సార్లు ఎక్కువగా తిరుగుతారు. అయితే చిత్రంగా… తమకు బలం ఉందని, అవి తమకు కంచుకోటలు అని చెప్పుకునే చోటే చంద్రబాబు – పవన్ లు ప్రచారాలు చేసుకుంటున్నారు. మిగిలిన చోట్ల తమకు బలం లేదని పవన్ అయితే నేరుగానే చెప్పేస్తున్నారు! ఏకంగా కుప్పంలోనే బాబు బెంగట్టినట్లు తిరుగుతున్నారు!!
వీరి సంగతి అలా ఉంటే… మరి పులివెందులకు జగన్ ఎందుకు వెళ్లడం లేదు. వెళ్లిన వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాలు చూసుకుని వచ్చేస్తున్నరే తప్ప.. ఎన్నికల ప్రచారం ఎందుకు చేసుకోవడం లేదు. ఇంకో అవకాశం ఇవ్వండి.. పులివెందులలో మంచి నీరిస్తాను అని ఎందుకు చెప్పడం లేదు. 30 ఏళ్లుగా తమ కుటుంబం పులివెందులకు ఏమి చేయకపోయినా.. ఈసారి మాత్రం గట్టిగా చేస్తాం అని చంద్రబాబు కుప్పంలో చెప్పినట్లు ఎందుకు చెప్పడం లేదు. అంటే… పులివెందులకు వైఎస్ ఫ్యామిలీ, తాజాగా జగన్ ఎంత చేయాలో అంతా చేశారు. నిత్యం చేస్తూనే ఉంటారు.
దీంతో… జగన్ కు పులివెందుల ప్రజలపై పూర్తి నమ్మకం.. పులివెందుల ప్రజలకు జగన్ అంటే భారీ ధైర్యం. మరి గడిచిన 30 ఏళ్లలో కుప్పం విషయంలో చంద్రబాబు అది ఎందుకు సంపాదించుకోలేకపోయారు.. ప్రజల్లో అది ఎందుకు కల్పించలేకపోయారు. అందుకే… ఇంత అనుభవం పెట్టుకుని, ఇన్ని పదవులు పొంది కూడా… ఇప్పటికి తొలిసారి పోటీ చేస్తున్న వ్యక్తిగా కుప్పంలో రిక్వస్టుల మీద రిక్వస్టులు చేసుకుంటూ తిరుగుతున్నారు అని అంటున్నారు పరిశీలకులు!