వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు గ్రీన్ సిగ్నల్!?

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడిగా విజయం సాధించాయి. ఈ సమయంలో వైసీపీ 40శాతం ఓట్లు సంపాదించుకున్నప్పటికీ అన్యూహ్యంగా 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి. అయితే కూటమికి ఈ స్థాయిలో భారీ విక్టరీ రావడానికి గల కారణల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం కూడా ఒక కీలక కారణం అనే చెప్పాలి.

ఏపీలో గతంలో వైసీపీ ప్రజానికం భారీ విజయం కట్టబెట్టినా చేసిన కొన్ని పొరపాట్ల వల్ల జీవితానికి సరిపడా ఓటమి అనుభవాన్ని సంపాదించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంక లైఫ్ లో ఎప్పుడూ అలాంటి పొరపాట్లు నిద్రలో కూడా జగన్ & కో చేయరని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈసారి కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తోందని కథనాలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఏపీ వాసులు కూడా బాగా నమ్మారని అంటున్నారు.

అయితే అనూహ్యంగా ఏపీలో టీడీపీ సహకారం లేకుండా కేంద్రంలో మోడీ ప్రధాని కాలేని పరిస్థితి నెలకొంది! ఇది ఏపీ వాసులు కూటమిపై నెట్టుకున్న నమ్మక ఫలితమే కాదు.. బాబు & కోపై పెట్టిన భారీ బాధ్యత కూడా! అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటూ, ఆ బాధ్యతను తీసి గట్టుమీద పెడుతూ, ఏపీ ప్రజలను వంచించడానికి చంద్రబాబు వేగంగా సిద్ధపడిపోయారనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా… వైజాగ్ స్టీల్ ప్లాంట్ గా పిలవబడే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎన్.ఎల్) వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు, దాని అదృష్టాన్ని పునరుద్దరించడానికి టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని ఆ పార్టీ వర్గాల నుంచే తెలిసిందని.. ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు బాబు అంగీకారం తెలిపేశారని జాతీయ మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి.

అవును… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వెళ్లివెత్తుతున్నాయి. ప్రైవేటీకరణతో తమకు ఇబ్బంది లేదని కేంద్రంతో చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారని అంటున్నారు. దీంతో… చంద్రబాబు మళ్లీ మొదలుపెట్టేశారనే మాటలు వినిపిస్తున్నాయి.

అయితే… ఈ విషయంలో ప్రజలను మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి బాబు ఇప్పటికే వ్యూహాలు రచించారని, ఆ దిశగా కథనాలు, నాయకుల స్టేట్ మెంట్లూ రాబోతున్నాయని అంటున్నారు. అయితే అది ఇప్పటికి జాతీయ స్థాయిలో ఉంది.. త్వరలో రాష్ట్ర స్థాయి నేతల నుంచి వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు… “కేంద్రం ప్రైవేటీకరణ విధానం వల్ల రాష్ట్రానికి వృద్ధి, పెట్టుబడులు వస్తాయి” అని బాబు ప్రజలను ప్రిపేర్ చేయబోతున్నట్లు చెబుతున్నారు!