నిలదీస్తున్న 2014… 2024లో చంద్రబాబుని ఎందుకు నమ్మాలి..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా రెండు వారాల వ్యవధి కూడా లేదు! దీంతో… నేతలు ప్రచారాలతో హోరెత్తించెశ్టుండగా.. అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసింది. 2014 మేనిఫెస్టోను కంపేర్ చేసుకుంటూ.. అందులో నెరవేర్చిన హామీలను వివరిస్తూ.. 2024 మేనిఫెస్టోను తెరపైకి తెచ్చింది.

ఈ సమయంలో టీడీపీ 2024 మేనిఫెస్టో సంగతి కాసేపు పక్కనపెడితే… 2014 మేనిఫెస్టో ప్రస్థావన తెరపైకి వస్తుంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిలో ఎన్ని నెరవేర్చారు అనే చర్చ విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో… 2014 మేనిఫెస్టోలోని 600 హామీల్లోనూ కొన్ని హామీలు, అవి అమలైన విధానం ఇప్పుడు చూద్దాం…!

రైతు రుణమాఫీ:

2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుభవం, మోడీ కలయిక, పవన్ కల్యాణ్ చేయూత వంటి కారణలకంటే అతిపెద్ద కారణం… మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న “రైతు రుణమాఫీ” హామీ! జగన్ మాత్రం.. తనకు సీఎంగా అనుభవం లేకపోయినా.. ప్రాక్టికల్ గా ఆలోచించి.. తాను రుణమాఫీ చేయలేనని చెప్పేశారు. కానీ అప్పటికే 10ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు తాను చేస్తానన్నారు.

ఇంకేముంది రైతులంతా బాబుకి మద్దతు తెలిపారు.. ఓట్లువేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు… ఆ రైతుల్ని దారుణంగా వంచించారు. మేనిఫెస్టో ప్రకారం రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, కేవలం 24వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసి మమా అన్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను సైతం వెటకారంగా మాట్లాడారు. అంటే… ఏరు దాటాక ఓడ మల్లన్న కాస్తా బోడి మల్లన్న అయినట్లన్నమాట!

మహిళల భద్రత – డ్వాక్రా రుణాలు!:

రైతులను అలా ఆకర్షించి.. ఇలా వంచించిన చంద్రబాబు… మహిళల విషయంలోనూ అదే పంథా అనుసరించారనే చెప్పాలి! ఇందులో భాగంగ… డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు కానీ చేయలేదు! చివరిగా 2019 ఎన్నికల ముందు “పసుపు – కుంకుమ” అంటూ డ్వాక్రా మహిళల్ని మభ్యపెట్టాలని చూశారనే కామెంట్లు వినిపించాయి. కానీ… మహిళల ముందు చంద్రబాబు ఎన్నికల పాచిక పారలేదు!

ఇదే సమయంలో… మేనిఫెస్టోలో మహిళలకు భద్రత అనే హామీ కూడా ఉంది! కానీ టీడీపీ హయాంలో “కాల్ మనీ సెక్స్ రాకెట్” తో ఎంతోమంది మహిళల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఒకానొక సమయంలో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయినా నిందితులపై చర్యలు కరువయ్యాయనే కామెంట్లు వినిపించాయి! ఓ మహిళా ఎమ్మార్వోని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకుని ఈడ్చడం అనేది అందులో బయటకు కనిపించిన ఒక ఉదాహరణ మాత్రమే!

బీసీలను బంతాడుకున్నారు!:

బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు… వారిని తనదైన శైలిలో వంచించారనే కామెంట్లు నాడు బలంగా వినిపించాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. 2014 ఎన్నికల సమయంలో… బీసీలకు రూ.10వేల కోట్లతో బడ్జెట్ కేటాయింపులు.. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు.. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి అంటూ మేనిఫెస్టోలో కబుర్లు చెప్పారు!

కానీ, అధికారంలోకి వచ్చాక… తోకలు కత్తిరిస్తా అని అన్నారు.

బాబు – జాబు… ప్రాసకోసం మాత్రమే!:

జాబు రావాలంటే బాబు రావాలి… కేవలం ప్రాసకోసం రాసుకున్న లైన్ అనే విషయం తెలుసుకోవడానికి ఏపీ యువతకు ఎక్కువ కాలమేమీ పట్టలేదు. బాబు హయాంలో సుమారు లక్ష ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. రూ.10వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూఉ… ఐదేళ్లు కాలం గడిపి చివర్లో రూ.2వేలతో సరిపెట్టారు! అది కూడా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన అతికొద్దిమందికి మాత్రమే!

చంద్రబాబు హయాంలో జాబ్ క్యాలెండర్ అని కూడా చెప్పారు.. అదో పెద్ద మోసంగా మారింది! లక్షా 42వేల ఖాళీలు ఉండగా.. వాటిని 70 వేలకు పరిమితం చేసి, అందులో 20వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి, చివరకు 2వేల పోస్ట్ లకు మాత్రమే నోటిఫికేెషన్లు ఇచ్చారు. మెగా డీఎస్సీ ఊసే ఎత్తలేదు!

వీటితో పాటు చంద్రబాబు ఎన్నికల వేళ హామీ ఇచ్చి, అధికారంలోకి వంచించిన హామీల చిట్టానే పెద్దగానే ఉంది!

పండంటి బిడ్డకు రూ.10వేలు అన్నారు కానీ ఇవ్వలేదు!

ఆడబిడ్డ పేరుతో రూ.30వేలు డిపాజిట్ అని చెప్పారు జరగలేదు!

పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు ఆ ఊసేలేదు!

ఆరోగ్యశ్రీని మెరుగుపరచకపోగా నిర్వీర్యం చేశారు! అందులో భాగంగా… ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు కాకుండా చేశారు!

కాపులకు ప్రతి ఏటా రూ.వెయ్యికోట్ల చొప్పున.. ఐదేళ్లలో 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. మొత్తంగా 1500 కోట్లు మాత్రమే విదిల్చారు!

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! అన్నం అంత అవసరం లేదు.. ఒక మెతుకు పట్టుకుని చూసినా సరిపోతుందని అంటారు.. కానీ, ఇక్కడ గుప్పెడు మెతుకులు పట్టి చూసుకున్నా తెలిసిపోతుంది.. 2014లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీపత్రం వెబ్ సైట్ లో కూడా కనిపించకుండా చేసిన వైనం!!