జగన్ ‘ఇంగ్లీష్’ మీడియం ఆశలు గల్లంతు..

Advisory committee requests YS Jagan 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  వాటిలో నిర్భంధ ఇంగ్లీష్ విద్య కూడ ఒకటి.  ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో బోధనను తొలగించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధనను చేయాలని వైఎస్ జగన్ సంకల్పించారు. కానీ ఈ నిర్నయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  ముఖ్యంగా టీడీపీ, జనసేనలు పెద్ద ఎత్తున ఖండించాయి.  ముఖ్యమైన ప్రాథమిక విద్యను మాతృ భాషలో బోధించటం మంచిదని, అప్పుడే పిల్లల్లో పరిణితి, విషయ గ్రాహక శక్తి వృద్ది చెందుతాయని అన్నారు.  నిజానికి అదే వాస్తవం కూడ.  మన దేశంతో పాటు ఇతర దేశాల్లో జరిపిన భాష, విడ్యాపరమైన పరిశోధనల్లో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే ఉత్తమమని తేలింది. 
 
 
కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ వాస్తవాలను పట్టించుకోలేదు.  తెలుగు మీడియంలో చదువుకోవడం మూలాన పిల్లలు ప్రపంచస్థాయి ఙ్ఞానానికి దూరమవుతున్నారని, ప్రపంచ స్థాయిలో రాణించలేకపోతున్నారని వాదించింది.  తెలుగు మీడియం ఉండాలని పట్టుబట్టిన పవన్ కళ్యాణ్ మీద మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అని, చంద్రబాబును మీ మనవడు దేవాన్ష్ తెలుగు మీడియమేనా అని వితండవాదపు ప్రశ్నలు వేశారు.  పేదలకు ఆంగ్ల విద్య దొరకడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, జనం మంచి చదువులు చదివి వృద్దిలోకి రావడం వారికి మింగుడుపడట్లేదని ఆరోపణలు గుప్పించారు. 
 
 
హైకోర్టు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషా మీడియాన్ని తొలగించడం రాజ్యాంగబద్దం కాదని, ఏ మీడియంలో చదువుకోవాలి అనేది పిల్లలు, తల్లిదండ్రుల ఇష్టానికి వదిలెయ్యాలని అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.  అయినా వినని ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి అందులో 96 శాతానికి పైగా తల్లిదండ్రులు అంగ్ల మాధ్యమంలో విద్యనే కోరుకున్నారని, వారి ఇష్టం మేరకే ఆంగ్ల మీడియాన్ని అమలు చేస్తామని అంటూ జీవో 81, 85 ను జారీ చేసింది.  తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా ఉంచి, తెలుగులో మాత్రమే చదువుకోవాలి అనుకునేవారి కోసం జిల్లాకు ఇక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.  వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియమేనని తేల్చి చెప్పింది. 
 
 
కానీ దాన్ని తప్పుబడుతూ హైకోర్టు 81, 85 జీవోలను రద్దు చేసింది.  దీంతో స్టే కోసం సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కింది.  ఇలాంటి సమయంలో కేంద్ర క్యాబినెట్ కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తూ విద్యా వ్యవస్థలో పలు మార్పులకు నిర్ణయం తీసుకుంది.  వాటిలో ప్రాథమిక విద్య అంటే 1 నుండి 5వ తరగతి వరకు విద్యా బోధన మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే ఉండాలని, అది తప్పనిసరి అని తేల్చింది.  అలా చేయడం వలన విద్యార్థుల్లో మానసిక పరిపక్వత, విషయ పరిజ్ఞానం పెంపు ఉంటాయని తెలిపింది.  అంతేకాదు వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటే మంచిదనే సూచన చేసింది.  అంటే ఏపీలో 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన తప్పనిసరి అయింది.
 
 
కేంద్రం ఏదో ఆషామాషీగా ఈ డెసిషన్ తీసుకోలేదు.  ఎన్నో దేశాలు అవలంభిస్తూ, మంచి ఫలితాలు పొందాయి కాబట్టే మాతృభాషలో బోధనను తప్పనిసరి చేసింది.  ఈ పరిణామంతో జగన్ ‘ఇంగ్లీష్’ మీడియం ఆశలు దాదాపు గల్లంతైనట్టే అనుకోవాలి.  కేంద్రమే చెప్పినప్పుడు, మెజారిటీ ఆమోదం ఆ నిర్ణయానికే ఉన్నప్పుడు ఏపీ సీఎం కూడా దాన్ని పాటించక తప్పదు.  మరి తెలుగు మీడియాన్ని తొలగించాలని పట్టునట్టి, ఏర్పాట్లు చేస్తున్న జగన్ కేంద్రం నిర్ణయం కాబట్టి మనసు మార్చుకుని మాతృభాషకు ఓటేస్తారో లేకపోతే తన సలహాదారుల అమూల్యమైన సలహాలను తీసుకుని కేంద్రం నిర్ణయాన్ని సైతం ధిక్కరిస్తారో చూడాలి.