(మల్యాల పళ్లంరాజు)
ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వధోరణులకు వ్యతిరేకంగా 1977లో దేశంలో ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఒక్కతాటిపైకి వచ్చి జనతాపార్టీగా ఏర్పడి ప్రభంజనం సృష్టించాయి. చివరి నిముషంలో జగ్జీవన్ రామ్ కూడా ఇందిరాగాంధీని వ్యతిరేకించి, డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వేరు పడి ప్రతిపక్షాలతో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది. ఆనాటి ప్రతిపక్షాల ఐక్యతకు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సూత్రధారిగా వ్యవహరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ నియంతృత్వధోరణులను దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2019 ఎన్నికలలో నరేంద్రమోదీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలే కాదు. గతంలో ఎన్డీఏలో భాగస్వామ్యపార్టీలుగా ఉన్న శివసేన, తెలుగుదేశంతో పాటు 18 చిన్నా చితక పార్టీలు బీజేపీకి దూరమయ్యాయి. ఈ పార్టీలన్నీ కూడా మోదీ నియంతృత్వ విధానాలను ఎండగడుతున్నాయి. అయితే ఈ పార్టీలన్నీ మోదీని గద్దె దింపే కార్యక్రమంలో ఏ మేరకూ తమ మధ్యగల విబేధాలను మరచి ఐకమత్యంతో ముందుకు సాగుతాయన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముఖ్యంగా 3 కూటములుగా ముందుకు వస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్రంగా ప్రతిపక్షాల కూటమి, కాంగ్రెస్, బీజేపీ లకు వ్యతిరేకంగా ఓ కూటమి, యూపీలో అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, మాయావతికి చెందిన బీఎస్ పీ ప్రత్యేక కూటమిగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మోదీ వ్యతిరేక ఫ్రంట్ ల ఏర్పాటులో కీలకపాత్ర వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల సమైక్యతా యత్నాలలో సంపూర్ణ కలయిక కన్పించడం లేదు. 1977 నాటి స్ఫూర్తి కొరవడినట్లు కన్పిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసినందుకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ కేంద్రంగా ప్రతిపక్షాలను ఏకంచేసేందుకు సిద్ధమయ్యారు. శరద్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్, కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, తమిళనాడుకు చెందిన డిఎంకె, కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి అధికారంలో ఉన్న (జనతాదళ్ ఎస్ ) జేడీఎస్, ఇతర పార్టీలు ఈ కూటమిలో కీలకపాత్ర వహిస్తున్నాయి. కేవలం మోదీని వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్న ఈ పార్టీలు అన్నీ 2019లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధంగా లేవు. ముఖ్యంగా నారాచంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మమతా బెనర్జీ ఇప్పుడే ప్రధాని అభ్యర్థి విషయం నిర్ణయించకుండా సమైక్యంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి. డిఎంకె ఇతర పార్టీలు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు.
మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో సమానదూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు చెందిన బిజేడీ కూడా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లతో కలవబోమని ప్రకటిస్తూ కేసీఆర్ ఆలోచనా ధోరణికి దగ్గరగా సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ సీపీ కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నది.
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ సమాజావాదీపార్టీ, మాయావతి బహుజన సమాజ్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినంతవరకూ కాంగ్రెస్, బీజేపీలను దూరం పెట్టేందుకు నిర్ణయించినట్లు కన్పిస్తున్నది. ఈ రెండు పార్టీలే యూపీలోని చిన్నాచితకా పార్టీలతో అవగాహనకు వచ్చి, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నరాయ్ బరేలీ స్థానాలను విడిచి పెట్టి యూపీలోని 80 పార్లమెంటు స్థానాల్లో చెరో 37 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించేసుకున్నాయి. అంటే యూపీలో ఎస్పీ, బీఎస్పీ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కేంద్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే.. చివరి నిముషంలో కాంగ్రెస్ తో కలిసేందుకు కూడా ఈ పార్టీలు సిద్ధమైనట్లు కన్పిస్తున్నది.
ఉత్తర ప్రదేశ్ కు సంబంధించినంతవరకూ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి కాదు. కాంగ్రెస్ తో జతకడితే ఫలితం ఉండబోదని ఎస్పీ, బీఎస్పీ భావిస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్లు తమకు బదిలీ కావని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. ఒకవేళ కూటమిలో చేర్చుకున్నా కాంగ్రెస్ ఓటర్లు బీజేపీవైపే మొగ్గుచూపుతారని నమ్మడంతో ఎస్పీ, బీఎస్పీ ఈ మేరకు సిద్ధమయ్యాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ అధికారానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎస్పీ, బీఎస్పీ ఆ పార్టీకి అండగా నిలిచి మెజారిటీ సాధించేటట్లు చూసినా, ఎస్పీ, బీఎస్పీలకు కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం కూడా ఇందుకు కారణంగా కన్పిస్తున్నది. యూపీలో తమ దళిత్ ఓట్ బ్యాంక్ కు కాంగ్రెస్ గండికొడుతున్నదని మాయావతి అనుమానించడం మరో కారణం. 2019లో ఉత్తర ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ,, కాంగ్రెస్ ఒకపక్క, బీజేపీ మరో పక్క ముక్కోణపు పోటీ పడితే కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని, ఆ విధంగా బీజేపీ లబ్ధి పొందకుండా నివారించవచ్చునని కూడా అఖిలేశ్, మాయావతి ఆలోచిస్తున్నట్లు కన్పిస్తున్నది. అయితే ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో బలంగా ఉన్న అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ), చిన్నపార్టీలైన అప్నాదళ్, భారతీయ సమాజ్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకు పోవాలని, దీనివల్ల 80 పార్లమెంటు సీట్లలో కనీసం 50 కి పైగా సీట్లు గెలుచుకోవచ్చునని ఎస్పీ, బీఎస్పీ కూటమి భావించడం విశేషం.
నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణులను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోదీ సర్కార్ ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రతిపక్షాలన్నీ ఉన్నాయి. కానీ, ప్రతిపక్షాలల్లో కీలక పాత్ర వహిస్తున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, ఎస్పీ, బీఎస్పీ నాయకులలో భవిష్యత్ లో తామే ప్రధాని కావాలన్న ఆశ కారణంగా ప్రతిపక్షాల మధ్య పూర్తి స్థాయి సమైక్యత సాధ్యం కావడం లేదు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ 1977 నాటి స్ఫూర్తితో సమైక్యంగా ఒక తాటిపైకి వస్తేనే 2019లో కేంద్రంలో బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం. లేని పక్షంలో మళ్లీ నరేంద్ర మోదీ సర్కార్ ను దేశ ప్రజలు మరో ఐదేళ్లు భరించవలసి వస్తుందేమో.. ఇప్పటికైనా ప్రతిపక్షపార్టీలు ఈ వాస్తవాన్ని గుర్తించి తమ వైఖరి మార్చుకోవాలి.
2019లో జయప్రకాశ్ నారాయణ్ ఎవరు?
(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, 9705347795)