ఫెడరల్ ఫ్రంట్ పురుడు పోసుకుంటుందా?

గత లోక్ సభ ఎన్నికలముందు  ఎన్డీయేకు యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడవ కూటమిని ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు జరిగాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు లీడ్ తీసుకున్నారు.  అయితే ఫ్రంట్ ఏర్పాటుకు, ఎన్నికలకు మధ్య  వ్యవధి చాలా స్వల్పంగా ఉండటంతో ఫ్రంట్ మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది.  ఆ ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ సొంతంగా మూడు వందలకు పైగా సీట్లు సాధించడంతో మూడవ కూటమి పక్కకు వెళ్ళిపోయింది.  

విచిత్రంగా గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీని ఖంగు తినిపించిన బీజేపీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓడిపోయింది.  కౌంటింగ్ మరికాసేపట్లో జరుగుతుందనగా కూడా  తమ విజయం మీద విశ్వాసం ప్రకటించారు కమలనాధులు. నలభై అయిదు సీట్లు తమ ఖాతాలో పడతాయని, ఢిల్లీ సుల్తాన్ తామే అని ప్రగల్భాలు పలికారు. ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందని  ముందస్తు సర్వేలు అన్నీ తేల్చి చెప్పినా, బీజేపీకి కనీసం ఇరవై నుంచి పాతిక స్థానాలు వస్తాయని సర్వేలు ప్రకటించాయి. అన్ని సర్వేలను పరిహసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ 2015  ఎన్నికల్లో మాదిరిగానే ఢిల్లీ మొత్తం కైవసం చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెల్చుకున్న బీజేపీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం కేవలం ఎనిమిది స్థానాలను మాత్రమే సాధించగలిగింది. మరి ఏడు మాసాల క్రితం సాధించిన విజయం ఏమైపోయిందో?  

ఏడాదిన్నర క్రితం వరకు దాదాపు ఇరవై రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తరువాత అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన బీజేపీ రాజధాని కొలువుదీరిన ఢిల్లీలో కూడా ఓడిపోవడంతో బీజేపీ వ్యతిరేకశక్తులలో కొత్త ఆశలకు జీవం పోసింది. మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందువరసలో ఉండగా ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిని NPR బిల్లును  సమర్ధించబోమని కుండబద్దలు కొట్టారు. పశ్చిమ బెంగాల్ కు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మమతా బెనర్జీ జాతీయస్థాయిలో మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించే పరిస్థితిలో లేరు.  బీఎస్పీ నాయకురాలు మాయావతికి అంత సమర్ధత లేదు. ఇక తమిళనాడు నుంచి డీఎంకే, అన్నా డీఎంకే జాతీయస్థాయి నాయకత్వానికి అంగీకరించరు. వారికి భాష సమస్య పెద్ద అడ్డంకి.  ఇక ఫెడరల్ ఫ్రంట్ కు ఆశాదీపంలా కనిపిస్తున్న నాయకుడు  మొన్ననే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్!  

కేసీఆర్ కు ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే…జాతీయస్థాయిలో ఆయనకున్న పరిచయాలు.  తెలంగాణ కోసం ముప్ఫయి ప్రాంతీయపార్టీల అధినేతలను స్వయంగా కలిసి ఒప్పించిన అనుభవం తో ఆయనకు విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి. మరొకటి ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడం అన్నిటికన్నా పెద్ద అసెట్ ఆయనకు. వయసు ఇంకా అరవై ఆరే. ఓపిక కూడా బాగానే ఉన్నది.  కేసీఆర్ కున్న మరొక అదృష్టం ఏమిటంటే, ఆయన కొడుకు, ప్రస్తుతం ఐటి, మునిసిపల్ శాఖలకు మంత్రిగా ఉన్న తారక రామారావు (కేటీఆర్) ఇప్పటికే తన సమర్ధతను రుజువు చేసుకుని కాబోయే ముఖ్యమంత్రిగా పరిగణించబడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని రావడమే కాక, తన భాషాపరిజ్ఞానంతో యువతకు ఆరాధ్యుడుగా అవతరించాడు. టీఆరెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొన్నటి మునిసిపల్ ఎన్నికలలో తన వ్యూహాచతురతతో పార్టీకి ఏకపక్ష విజయాలను సమకూర్చి పెట్టాడు.  ఆయనను కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పటికే జనం నమ్ముతున్నారు.  ఈ క్షణంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపడతానన్నా అభ్యంతరం చెప్పేవారు లేరు.  అందువలన కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మళ్ళేట్లయితే రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోదు.  పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు.  దేశంలో మరే ఇతర నాయకుడికీ ఇలాంటి సౌలభ్యం లేదు.  మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముప్తి, జగన్ మోహన్ రెడ్డి,   మొదలైన ఏ నాయకులకూ వారి పార్టీలో ప్రత్యామ్నాయం లేదు. వారు లేకపోతె ఆయా పార్టీల ఉనికే ప్రశ్నార్ధకం.   మోడీకి ప్రస్తుతం వ్యతిరేకమే అయినప్పటికీ,  చంద్రబాబును అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు.  ఎందుకంటే ఆయన విశ్వసగుణం లేని నాయకుడు. మోడీ కాళ్ళు పట్టుకోగలడు. అవసరం అయితే రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకోగలడు.  జాతీయస్థాయిలో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి అన్నో ఇన్నో లోకసభలో సీట్లు కలిగిన పార్టీలను ఏకం చెయ్యాలంటే అందుకు కేసీఆర్ ఒక్కరే సమర్ధులని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కేసీఆర్ కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఆయన ఉపన్యాసాలు తెలియజేస్తున్నాయి.  

అయితే ఇక్కడ ఒక సత్యాన్ని అంగీకరించాలి.    బీజేపీ ఏకపక్షంగా రెండోసారి  పార్లమెంట్ లో మెజారిటీ సాధించింది.  ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది.    సోనియా గాంధీకి వయసు మళ్లింది.  రాహుల్ గాంధీ ఏమాత్రం రాణించలేకపోతున్నాడు.  కేరళలో గెలవనట్లయితే ఆయన లోక్ సభలో అడుగు పెట్టగలిగేవాడు కాదు. పదిహేనేళ్ల రాజకీయ జీవితం తరువాత కూడా ఆయనలో ఎందుకో పరిణితి కనిపించడం లేదు.  ప్రియాంకగాంధీ చరిష్మా కూడా పనిచేస్తున్నట్లు లేదు.  కానీ, దేశంలో జాతీయస్థాయి ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే.  జాతీయ స్థాయి అంటే నా అభిప్రాయంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో ఎంతోకొంత అభిమానించబడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. ఫెడరల్ ఫ్రంట్ విజయవంతం కావాలంటే కాంగ్రెస్ సహకారం కూడా అవసరమే. 2024 నాటికి బీజేపీ రెండు టర్మ్స్ పాలించి ఉంటుంది కాబట్టి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.  ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం, పార్టీలను ఏకం చెయ్యడం, అందరిని ఒక్కతాటి మీద నడిపించడం కత్తిమీద సాము వంటిది.  ఒకప్పుడు తెలుగువాడు ఎన్టీఆర్ అలాంటి నాయకత్వ బాధ్యతను తీసుకుని రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూల్చివెయ్యగలిగాడు.  మళ్ళీ ఈసారి అలాంటి ఘనత తెలుగుబిడ్డకే దక్కుతుందా?  కేసీఆర్ నాయకత్వంలో  ఫెడరల్ ఫ్రంట్ విజయం సాధిస్తుందా?  ఏమో చెప్పలేం.  … కేసీఆర్ ఎంతకైనా సమర్థుడే…  కేసీఆర్ ప్రధాని పదవిని చేపట్టాలని చాలామంది కోరిక.  దక్షిణాది నాయకులలో ఆ అర్హతను కలిగిన వాడు కేసీఆర్ మాత్రమే.  

 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు