బాలీవుడ్ తరువాత దేశంలో అత్యధికంగా సినిమాలను తీసే చిత్ర పరిశ్రమ మనదే. సినీ పరిశ్రమకు ప్రేక్షకులే దేవుళ్లు. వారే కొండంత అండ. అభిమానానికి అతీతంగా సినిమాలను చూస్తారు తెలుగు ప్రేక్షకులు. ఆధునిక సినీ పరిశ్రమలో ఈ ధోరణి మరింత పెరిగింది. తమ హీరో గొప్ప అనే స్థాయిని దాటి పోయారు మనవాళ్లు. సినిమాలు బాగుంటే రిపీట్‌గా చూడ్డానికీ ఇష్టపడతారు. ఈ నాడి తెలిసిన ఒకరిద్దరు సినీ పెద్దలు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం గానీ, రాజకీయ అవసరాల కోసం గానీ సినిమాలను తీయడం మొదలు పెట్టారు.
ఎప్పటి నుంచో ఈ తరహా వైఖరి పరిశ్రమలో ఉన్నప్పటికీ.. ముసుగును తొలగించుకుని నేరుగా బయటపడటాన్ని మాత్రం ఇటీవలి కాలంలోనే. కొన్నేళ్ల వరకూ నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన రాజకీయాలు, కులాల కుంపట్లు కాస్తా అభిమానులను అదే కులాలవారీగా విడగొట్టడం కూడా మొగ్గ తొడిగిందా? అనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబర్ 150`, బాలకృష్ణ `గౌతమి పుత్ర శాతకర్ణి` సినిమాల విడుదల సందర్భంగా ప్రేక్షకులు ఎలా చీలిపోయారో చూశాం. ఒక్కరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు సినిమాలపై ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ పెద్ద యుద్ధమే సాగించారు.
ఇప్పుడు కూడా అలాంటి యుద్ధ వాతావరణమే నెలకొంది. బయోపిక్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటు కామెంట్లు చేశారు. అక్కడితో వెనక్కి తగ్గని ఆయన.. తన వాదనను సమర్థించుకున్నారు కూడా. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించలేరని బాలకృష్ణ ఓ సందర్భంలో చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. `మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు..` అంటూ బాలకృష్ణ తన కులాన్ని ప్రస్తావించారు. చిరంజీవి సామాజిక వర్గాన్ని లోకువ చేసేలా మాట్లాడారు. దాన్ని దృష్టలో ఉంచుకున్న నాగబాబు.. బయోపిక్‌పై విమర్శలు గుప్పించారు. దీనితో మరోసారి ప్రేక్షకులు రెండు సామాజిక వర్గాలుగా చీలిపోవడానికి అవకాశం ఏర్పడింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాలనేవి మొదటినుంచీ ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో అవి పతకాస్థాయికి చేరుకున్నాయి. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ అండ కావాలి. అధికారంలో ఉన్న పార్టీలకూ సినీ పెద్దల ఆసరా ఉండాలి. ఎన్టీఆర్ సినీ రంగప్రవేశంతో రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు చోటు చేసుకున్నాయి.
1983లో తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్.. అతి తక్కువ కాలంలో అంటే తొమ్మిది నెలల వ్యవధిలోనే ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడం ఒక ఎత్తు. అప్పటి నుంచీ చిత్ర పరిశ్రమ, రాజకీయాలు సమాంతరంగా సాగాయి. ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారంటే.. దానికి కారణం సినీ ప్రేక్షకులే. ఆయనను చూసే తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకదాంట్లో ఓడిపోయి ఉండవచ్చు గాక. రాజకీయాల్లో ఆయన నిలదొక్కుకోవడానికి, అధికారాన్ని అందుకోవడానికీ సినీ ప్రేక్షకులే కారణం.
ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నప్పటి రోజుల్లో, రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్న సమయంలో సినీ ఇండస్ట్రీలో కులాల కుంపటి ఉండేది. రాష్ట్రంలో రెండు బలమైన సామాజిక వర్గాలు చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చలాయించడం కూడా మొదలైంది . అక్కినేని నాగేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా `మండలాధీశుడు`, `నా పిలుపే ప్రభంజనం`, `సాహసమే నా ఊపిరి` వంటి సినిమాలు తీశారు. అవి సంచలనం సృష్టంచాయి. ఒక దశలో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు కృష్ణ, మోహన్‌బాబు కేరాఫ్‌గా నిలిచారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, ఆయనను గద్దె దించి, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సినీ పెద్దల అండ అత్యవసరమైంది. తన సామాజిక వర్గానికి చెందిన సినీ పెద్దలను ఆయన చేరదీశారు. పార్టీ పరంగా పదవులను కట్టబెట్టారు.
రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవి బయోపిక్‌లు కావు. సమకాలీన రాజకీయాలు, రాజకీయ నాయకులకు చురకలు వేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయే తప్ప, ఓ రాజకీయ నాయకుడి జీవితం ఆధారంగా పూర్తిస్థాయిలో బయోపిక్‌లను సినీ పెద్దలు తీయలేకపోయారు. తీయలేకపోయారనే బదులు అసలు ఆ ఆలోచనే చేయలేదని అనుకోవచ్చు. 2000 దశకం దాటిన తరువాత సినీ పరిశ్రమ ఆధునిక పోకడలను సంతరించుకుంది. ఫక్తు కమర్షియల్ సినిమాలను తీయడం మొదలు పెట్టారు దర్శకులు.
90వ దశకాల్లో ఓ సినిమా వంద రోజులు ఆడటం ఓ రికార్డు. వందరోజుల మైలురాయిని అందుకుంటే- ఫంక్షన్లను నిర్వహించే వారు. జ్ఞాపికలను అందజేసే వారు. 100 రోజులు ఆడని సినిమా, సినిమానే కాదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమయ్యేది. ఓ తరం దాటిన తరువాత..ఇక కలెక్షన్లే సినిమా హిట్‌కు ప్రాతిపదిక అయ్యాయి.
వారంరోజుల పాటు ఆడినా ఫర్వాలేదు..కలెక్షన్లు వస్తే చాలనే స్థిర అభిప్రాయంతో సినిమాలు తీస్తున్నారు. అదే సమయంలో ప్రయోగాలకూ శ్రీకారం చుట్టారు. కొత్త దర్శకులు వచ్చిన తరువాత, రొటీన్‌కు భిన్నంగా సినిమాలు తీయడం ఆరంభించారు. ఇలా వారి ఆలోచనల్లోంచి ఏర్పడిందే బయోపిక్‌లు. బాలీవుడ్‌లో బయోపిక్‌లు సక్సెస్ కావడంతో.. అదే జోనర్‌లో సినిమాలు తీయడం మొదలు పెట్టారు.
హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌కు క్లాప్ కొట్టడానికి ముందే- ఇది ఎన్నికల స్టంట్ కోసమా? అనే గాసిప్స్ వినిపించాయి. ఆ ఉద్దేశంతోనే సినిమాను ఆరంభించారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొదట్లో సినిమా కోసం పనిచేసిన దర్శకుడు తేజను అర్ధంతరంగా తొలగించడం, బాలకృష్ణ సామాజిక వర్గానికే చెందిన క్రిష్‌కు ఆ బాధ్యతలను అప్పగించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టయింది. రాజకీయ లబ్ది కోసమే ఎన్టీఆర్ బయోపిక్‌ను తీస్తున్నారనే అభిప్రాయం బలపడింది.
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన విలన్ చంద్రబాబు నాయుడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఎన్టీఆర్ ఎలా పదవీచ్యుతుడయ్యారు, దాని వెనుక చంద్రబాబు పాత్ర ఏమిటనేది ప్రస్తుత తరానికి పూర్తిగా తెలియకపోవచ్చు. అలాంటి వ్యక్తి పాత్రను వాస్తవానికి భిన్నంగా చిత్రీకరించడానికి అంగీకరించకపోవడం వల్లే తేజను తొలగించారనేది ఫిల్మ్‌నగర్ టాక్.
చంద్రబాబు పాత్రలోని నెగెటివ్ షేడ్స్‌ను చూపిస్తే.. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు? ఎన్నికల సమయంలో చంద్రబాబు పాత్ర నిజ స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపిస్తే ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుందనే భయం ఉండటం సహజమే. ఎన్టీఆర్ బయపిక్ కథను కూడా కేవలం ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకే పరిమతం చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే.
నిర్మాతలు, దర్శకులు, కథకలు భయపడినట్టు ప్రేక్షకులు ప్రభావితం కాగలుతారా? అంటే అవుననే చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు తీవ్రం అవుతాయి. తీవ్రతా పెరుగుతుంది. తటస్థ ఓటర్లు ప్రభావితం అవుతారు. ఎంతో కొంత చంద్రబాబు పట్ల అభిమానం ఉన్న వాళ్లు దూరం అవ్వొచ్చు. తెలుగుదేశం అభిమానులపై ప్రత్యర్థులదే పైచేయి అవుతుంది. దీనితో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిన రావడం అదనపు బాధ్యతగా మారుతుంది. ఈ తరహా బయోపిక్‌లు ప్రేక్షకులను ప్రభావితం చేయగలుగుతాయనే భయం ఉండటం వల్లే..ఎన్టీఆర్ పదవీచ్యుడైన సన్నివేశాల జోలికి వెళ్లలేదు చిత్రం యూనిట్.