ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో భాగంగా… అధికార వైసీపీలో ఇంచార్జ్ ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు టీడీపీ, జనసేన తమ తొలి జబితా విడుదలకు సిద్దమయ్యాయని తెలుస్తుంది. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాట్లపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన సీట్ల ఖరారు వేళ అనూహ్య పరిణామలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురు సీనియర్లకు సైతం సీట్లు గల్లంతు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సంకేతాలు ఇప్పటికే కేడర్ లోకి వెళ్లడంతో ఆయా నాయకులు అనుచరులు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా… రాజమండ్రి రూరల్ లో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఈ దఫా సీటు కష్టం అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఆయన అనుచరులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి పార్టీతో ఉన్న బుచ్చయ్యను బాబు కావాలనే తొక్కేస్తున్నారని, అందుకే ఇప్పటివరకూ మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు.
అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు కేటాయించాలని పవన్ పట్టుబట్టినట్లు సమాచారం. ఆ స్థానంలో జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేత కందుల దుర్గేష్ పోటీచేయబోతున్నారు. అయితే… ఇది బుచ్చయ్య అనుచరులకు ఏమాత్రం నచ్చడం లేదని.. ఈ దఫా కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి మంత్రి అవుతారని భావిస్తున్న వేళ… ఇది వెన్నుపోటని ఫైరవుతున్నారు.
ఇదే సమయంలో నిన్నటివరకూ మౌనంగా ఉన్నట్లు కనిపించిన తెనాలి టీడీపీ కేడర్ సైతం ఇప్పుడు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పార్టీకి అల్టిమేటం జారీచేశారని తెలుస్తుంది. గుంటూరు జిల్లా తెనాలి టిక్కెట్ ఆలపాటి రాజాకే ఇవ్వాలని, సీనియర్లను ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. దీంతో తెనాలి టీడీపీలో రచ్చ మొదలైందని తెలుస్తుంది.
పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి తానే పోటీ చేయబోతున్నట్లు తనకు తానే ఇప్పటికే ప్రకటించేసుకున్నారు నాదెండ్ల మనోహర్. అయితే… ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ ఇచ్చేది లేదని పట్టుబడుతున్నారు ఆలపాటి అనుచరులు. అయితే… నాదేండ్ల మనోహర్ సైతం తగ్గేదేలే అని పట్టుబడుతున్న నేపథ్యంలో… ఈ రెండు స్థానాల్లోనూ చంద్రబాబు – పవన్ లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటార్నేది ఆసక్తిగా మారింది.