ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలపై పెద్దగా భారత్ రాష్ట్ర సమితి ఫోకస్ పెడుతున్నట్టు లేదు. ప్రస్తుతానికైతే ఎంపీ స్థానాల గురించే బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు చూస్తున్న తోట చంద్రశేఖర్ కూడా పార్లమెంటుకే పోటీ చేసే అవకాశాలున్నాయి.
తాజాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తరఫున ఆయన విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారంటూ ఓ ప్రచారం గట్టిగా జరుగుతోంది. పది నుంచి పదిహేను లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాలన్నది బీఆర్ఎస్ వ్యూహమట.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత, ఏపీలోని ఏదో ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పది నుంచి పదిహేను సీట్లపై ఫోకస్ పెట్టినా, ఒకట్రెండు స్థానాల మీదనే ఎక్స్ట్రా ఫోకస్ వుండబోతోంది.
ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే, 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందనీ, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమీకరణాలపై కేసీయార్ స్వయంగా అధ్యయనం చేస్తున్నారనీ అంటున్నారు.
2019 ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు, ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్ని శాంపిల్‌గా తీసుకుని, అక్కడ తమ సానుభూతిపరుల్ని పెంచుకుని, వారి ద్వారా టీడీపీని దెబ్బకొట్టి, వైసీపీ వైపు ‘తూకం’ మొగ్గేలా చేసిన సంగతి తెలిసిందే.