ఏదో రకంగా అధికారంలోకి రావాలన్న తపనే తప్ప… ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదిద్దాం, పార్టీ నేతలంతా ఒకటే మాట మీద ఉందా, ఓటర్లు ఒకప్పటిలా లేరు, అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2019 తర్వాతైనా మనకు ఈ విషయలో సృహ ఉండాలి అనే ఆలోచన టీడీపీ నేతలు ఏమాత్రం చేయడం లేదని అంటున్నారు పరిశీలకులు.
వెనకా ముందూ చూసుకోకుండా నోరు జారడం.. ఆనాక, కవరింగ్ కబుర్లు చెబుతూ సన్నాయినొక్కులు నొక్కడం.. ఈ గ్యాప్ లో ట్రోలింగ్ కి గురవ్వడం, ప్రజల్లో చులకన అవ్వడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… వాలంటీర్లపై ఒకప్పుడు పైత్యపు మాటలు మాట్లాడినా… ఎన్నికల వేళ కాస్త కాం గా ఉంటున్నారు టీడీపీ, జనసేన అధినేతలు! అయితే ఆ ఎలక్షన్ స్టంట్ కొంతమంది టీడీపీ నేతలకు అర్ధం అవుతున్నట్లు లేదు! ఇదే ఇప్పుడు పెద్ద సమస్య!
వివరాళ్లోకి వెళ్తే… వాలంటీర్లను ఉగ్రవాదులతో పోలుస్తూ మాట్లాడారు శీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. దీనివల్ల ఆయన కడుపు మంట చల్లారి ఉండొచ్చు.. లేదా, నోటి సరదా తీరి ఉండొచ్చు! కానీ… ఎన్నికల వేళ పార్టీకి బలమైన డ్యామేజ్ జరగడంతో పాటు, గతంలో వాలంటీర్లపై టీడీపీ, జనసేన నేతలు చేసిన విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో… ఇప్పుడు అవన్నీ కలిపి ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో కవరింగ్ కార్యక్రమాలు తెరలేపింది టీడీపీ. ఇందులో భాగంగా… వాలంటీర్లపై టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు పెంచుతామని స్పష్టత చేశారు. వాలంటీర్లు వారి వారి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని చెప్పుకొచ్చారు.
ఆ సంగతి ఒకెత్తు అయితే… ప్రస్తుతం రెండు రోజులుగా కుప్పంలో బిజీగా పర్యటిస్తున్న చంద్రబాబు మరింత కవరింగ్ వ్యాఖ్యలు చేసుకునే ప్రయత్నం చేశారు! కుప్పం పర్యటనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతూ, తనను ఇప్పటికే 7 సార్లు గెలిపించారని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో కుప్పాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా… తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ సంపాదించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంల్మో… స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో… అడుసు తొక్కనేల కాలు కడగనేల అని అంటున్నారు పరిశీలకులు.