గతంలో వైసీపీ అధినేత జగన్ కలలుగన్న అవకాశం చంద్రబాబుకి వచ్చింది. కేంద్రంలో తనపై ఆధారపడిన ప్రభుత్వం ఏర్పడింది. ఒకప్పుడు జగన్ కోరుకున్నది ఇదే! అయితే ఆ అవకాశం, అదృష్టం మాత్రం చంద్రబాబుకు దక్కింది. ఇది కచ్చితంగా సువర్ణావకాశమే.. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో కచ్చితంగా ఇది ఆయనకు దక్కిన అద్భుత అవకాశమే. వినియోగించుకుంటారా?
ఇప్పుడు ఏపీలో సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇది. సాధారణంగా ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం.. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రియారిటీ ఇస్తారనే విమర్శలు బాబుపై ఉన్న సంగతి తెలిసిందే. 2014లో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం బాధ్యతలు ఆయన తీసుకోవడం దీనికి ఒక ఉదారహణగా చెబుతుంటారు. ఇది నాడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటి.
ఆ సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు ఊత కర్రల మీద నిలబడిన సంగతి తెలిసిందే. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ల సహాయ సహకారాలతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఇది తొందర్లో కూలిపోద్దని కాంగ్రెస్స్ కామెంట్లు కూడా మొదలుపెట్టేసింది.
ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇది తనకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం అని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో… సరిగ్గా టైం చూసి ప్రత్యేక హోదా డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. ఇది ఎట్టిపరిస్తుల్లోనూ చేసి తీరాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. పైకి ఇది రిక్వస్ట్ గా అనిపించినా.. బీజేపీకి మాత్రం అల్టిమేటం అనే చెప్పుకోవాలి.
వాస్తవానికి బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పుడు కొత్తగా చేసిందేమీ కాదు.. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది ఇన్నాళ్లు డిమాండ్ గా మాత్రమే ఉండిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్రంలో తమ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అవ్వడంతో… ఇంతకు మించిన సువర్ణావకాశంమరొకటి ఉండదని భావించిన నితీష్… ఓపెన్ అయిపోయారు.
ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో 12 మంది జేడీయూ సభ్యులు ఉన్నారు. దీంతో… ఎన్డీయే కూటమిలో జేడీయూ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. అయితే అంతకంటే బలంగా రెండో అతిపెద్ద పార్టీగా 16 మంది ఎంపీలతో ఉంది టీడీపీ. ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ ఉన్న పరిస్థితుల్లో ఇది అతిపెద్ద సంఖ్య. ఈ నెంబర్ తో కేంద్రం నుంచి ఏమైనా సాధించుకోవచ్చని అంటున్నారు.
ఇందులో భాగంగా ప్రధానంగా ప్రత్యేక హోదాతో పాటు కొత్త రైల్వే లైన్ లను శాంక్షన్ చేయించుకొవచ్చని గుర్తు చేస్తున్నారు. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్ల విషయంలో కేంద్రం నిత్యం సవతి తల్లి ప్రేమే చూపిస్తుంటుందనేది తెలిసిన విషయమే! ఈ నేపథ్యంలో ఆ పనులు కూడా చేయించుకోవచ్చు. ప్రధానంగా కోనసీమకు రైల్వే తేవాలని ఆ పార్టీ నేత బాలయోగి కోరిక తీర్చినట్లూ అవుతుంది.
అయితే… చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ప్రస్తుతానికి మౌనంగానే కనిపిస్తున్నారు. అలా కాకుండా… వాతావారణం వేడిగా ఉన్నప్పుడే పని కానిచ్చేసుకుంటే బాగుంటుందని.. ఈ విషయంలో నితిష్ ని ఆదర్శంగా తీసుకుని అయినా ఈ పనులు కానిచ్చుకోవాలని అంటున్నారు. ఇదే సమయంలో.. విభజన హామీలన్నింటినీ క్లియర్ చేసుకునే అవకాశం ఇలాంటిది మరొకటి రాదని చెబుతున్నారు.