నంద్యాలలో మంగళవారం నాడు జరిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఎపిసోడ్ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే రచ్చ వైసీపీ – టీడీపీ నేతల మధ్య జరిగి ఉంటే… బాబు & కో హడావిడి మరోలా ఉండేది. ఇక కడప రౌడీలని, కర్నూలు ఫ్యాక్షనిజం అని, అనంతపురం అల్లర్లనీ ఊకదంపుడు విమర్శలు చేసేసేవారు. అయితే… ఇది పూర్తిగా పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య రచ్చ కావడంతో బాబు ఆందోళనలో ఉన్నారని తెలుస్తుంది. దీంతో పాటు “చున్నీ” వ్యవహారం తెరపైకి వచ్చింది.
మంగళవారం లోకేష్ పాదయాత్రలో జరిగిన ఈ రచ్చపై అఖిల ప్రియ తన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా.. “ఏవీ సుబ్బారెడ్డి నా చున్నీ పట్టుకొని లాగాడు.. దాంతో నా డ్రెస్ చిరిగిపోయింది. చున్నీ ఎందుకు లాగావని అడిగితే ఏవీ సుబ్బారెడ్డి నన్ను దూషించాడు. అది చూసి నా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు” అని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో… “ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి ఏవీ పోటీచేయాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుంటే… అది సహించలేక హైదరబాద్ నుంచి మనుషులను తెప్పించి దాడి చేయించింది అఖిల ప్రియ.. అంతేతప్ప చున్నీ టాపిక్కే లేదు” అని ఏవీ వర్గీయుల వెర్షన్ గా ఉంది.
వీళ్ల వెర్షన్స్ ఇలా ఉంటే… మరోపక్క ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు… పార్టీ నేతలతో టెలికాంఫరెన్స్ లో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తప్పెవరిదో తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే సమయంలో షేత్రస్థాయిలో ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునేందుకు ముగ్గురు సీనియర్ నేతలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే… అఖిల ప్రియ – ఏవీ వర్గపోరు విషయంలో బాబు సాధించేది ఏమీ ఉండదని.. ఉండబోదని.. ఆ పోరు ఇప్పట్లో చల్లరేది కాదని చెబుతున్నారు స్థానికులు. కారణం… చంద్రబాబుకు వీరిద్దరూ భయపడే బ్యాచ్ కాదని అంటున్నారు!
మరి ఈ విషయంపై తన అనుభవాన్ని ఉపయోగించి బాబు వీలైనంత తొందరగా పరిష్కరించుకోగలుగుతారా.. లేక, లిట్ తీసుకుని ఆ రెండు నియోజకవర్గాలనూ వదిలేసుకుంటారా అన్నది వేచి చూడాలి!