మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ‘జగన్ తప్ప, పార్టీలో ఎవరి మాటా నేను వినను..’ అని తెగేసి చెప్పారు. కొత్తగా ఈ మాట ఆయన నోట ఎందుకు వచ్చినట్లు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.
వైసీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ఔట్ అయిపోయారు. వారందర్నీ వైసీపీనే గెంటేసింది. అదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకి పాల్పడ్డారన్న కారణంగా. ఆ తర్వాతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తెరపైకొచ్చింది. ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కారు.
పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని మీడియా ముందు కంటతడి పెట్టారు కూడా. టీడీపీతో ఆయన టచ్‌లోకి వెళ్ళినట్లు ప్రచారమూ జరిగింది. జనసేన తరఫున కొందరు ఆయనతో మంతనాలు జరిపినట్లూ వార్తలొచ్చాయి. ఇంతలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాయిస్ మార్చారు.
ఒంగోలు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారాయన. ఆయనకు టిక్కెట్ ఇంకోసారి ఇచ్చే ఉద్దేశ్యమైతే వైసీపీ అధినాయకత్వానికి లేనట్టే కనిపిస్తోంది. జగన్ కోసమే కాంగ్రెస్ పార్టీని వదిలేశాననీ, జగన్‌కి తప్ప ఇంకెవరికీ వైసీపీలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనీ బాలినేని చెబుతున్నారు.
అదేంటీ, పార్టీ మారే ఆలోచన చేసి.. ఇప్పుడిలా బాలినేని ప్లేటు ఫిరాయిస్తున్నట్లు.? ఎక్కడో తేడా కొడుతోంది. అయితే, బాలినేని విషయంలో వైఎస్ జగన్ ఒకింత ఆగ్రహంతోనే వున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. బాలినేని ఎంత వేడుకున్నా, వైఎస్ జగన్ తిరిగి ఆయన్ని అక్కున చేర్చుకునే అవకాశం లేదట.