ఆరోగ్యశ్రీకి అనారోగ్యం.! ఎందుకీ సమస్య.?

బకాయిలు చెల్లించలేదంటూ ప్రభుత్వానికి ‘ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు’ అల్టిమేటం ఇచ్చాయి. ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు అల్టిమేటం ఇవ్వడమనేది అత్యంత హాస్యాస్పదమైన వ్యవహారం. నిజానికి, ఇది అత్యంత విచారకరమైన విషయం.!

ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం వందల కోట్లు, వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది ఆరోగ్యశ్రీ పథకం కింద. లబ్దిదారుల సంఖ్య పెరుగుతోంది.. చికిత్సలూ పెరుగుతున్నాయ్.. రోగాల సంగతి సరే సరి.! ప్రభుత్వాసుపత్రుల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెబుతూ, ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆరోగ్య శ్రీ ద్వారా పెంచి పోషించడమేంటో.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ఆరోగ్య శ్రీ’ని పరిచయం చేసినప్పటి పరిస్థితులు వేరు. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మార్పులు రాలేదు ప్రభుత్వాసుపత్రుల్లో. పూర్తిగా మారలేదని అనలేంగానీ, మారాల్సిన స్థాయిలో మారలేదంతే.

ప్రభుత్వాసుపత్రుల్లోనే సౌకర్యాల్ని మెరుగు పరిస్తే, ప్రైవేటు ఆసుపత్రుల అవసరం ఏమొస్తుంది.? పైగా, వందల కోట్లు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి రావడం అత్యంత బాధాకరం.

రేపట్నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించడమంటే, బరితెగింపులానే భావించాలి. ప్రభుత్వం భయపడిపోయి, అప్పటికప్పుడు నిధులు విడుదల చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ విషయమై ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది.