ఏపీలో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జగన్ చేసిన తప్పులే సోపానాలుగా కూటమికి కలిసి వచ్చింది! ప్రజానికం కూడా బాబు, పవన్ లు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు! ఊహించని స్థాయిలో అన్న మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు & కో చేయాల్సిన పని ఏమిటి? ఇచ్చిన హామీలు నెరవేర్చడం.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం! కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు!
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం పెన్షన్స్ హామీ తప్ప మిగిలినవేమీ చెప్పినట్లు నెరవేర్చలేదని అంటున్నారు. ఉచిత ఇసుక గురించి జనాలు ఏమనుకుంటున్నారనేది తెలిసిన విషయమే. తల్లికి వందనం జీవో విడుదల అనంతరం సందిగ్ధంలో పడిందని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీపై రెవిన్యూ మంత్రి ట్వీట్ చేసి, డిలీట్ చేశారు. దీంతో.. సర్కస్ సర్కార్ అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
మరోపక్క తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడానికి కారణం జగన్ సర్కార్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన బాబు… దానిపై ప్రశ్నించిన జర్నలిస్టులపై విరుచుకుపడుతున్నారు! ఇక మిగిలిన సూపర్ సిక్స్ టాపిక్కే ఎత్తడం లేదు.. ఆ ఊసే లేదు!
అధికారంలోకి రాకముందు హల్ చల్ చేసిన పవన్ కల్యాణ్… ఇప్పుడు మీడియాను అడ్రస్ చేయడానికి జంకుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో… ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అకృత్యాలపై తాజాగా హోం మంత్రి అనిత స్పందించారు. ఈ సందర్భంగా బాబు తరహాలోనే స్పందించారనే కామెంట్లకు అవకాశం ఇచ్చారని అంటున్నారు.
ఇందులో భాగంగా… ఇవన్నీ గత ప్రభుత్వపు విష బీజాల అవశేషాలని ఆరోపించారు. వాటిని తొలగించాల్సిన బాధ్యత తమపై పడిందని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో పోలీస్ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయిందని.. ఆ ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో చాలా అరాచకాలు జరిగాయని తెలిపారు.
ఈ రియాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తో పాటు మంత్రులు మాట్లాడే విధానం చూస్తుంటే… ఈ ఐదేళ్లూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, జరిగిన ప్రతీ ఘటననూ గత ప్రభుత్వానికి ముడిపెడుతూ కాలం గడిపేసేలా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా విధానాలు అవలంభించారని.. మీడియా కప్పి పుచ్చిందని.. ఫలితం చూశారని చెబుతున్నారు. ఇకపై అయినా గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానాలని.. వారు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే 11 కి పరిమితమయ్యారని.. ఆ విషయం ప్రజలకు తెలుసు గనుకే వాళ్లకు ఆ ఫలితాలు, మీకు ఈ ఫలితాలు అని అంటున్నారు.
ఇకపై అయినా సాకులు మాని.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు! ప్రతీ సమస్యకు గత ప్రభుత్వాన్ని విమర్శించడం వల్లో.. అంతటికీ జగనే కారణం అని చెప్పడం వల్ల.. తాము చేతకానివారమని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు!