సామాన్యుడి కష్టాలు అర్ధం చేసుకోవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి నిరూపించుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. కారణం… తాజాగా అర్చకుల విషయంలో జగన్ మరో కీలక అడుగు వేశారు.
అవును… ఏపీలో అర్చకులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్ నుయూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 10వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ వివరాలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగనున్నాయని తెలుస్తుంది.
ఇదే సమయంలో అర్చకుల రిటైర్మెంట్ విషయంలోనూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ వయసును కూడా 62కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా… అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన మంత్రి… రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న 2,625 మంది అర్చకులకు పెంచిన వేతనాలను వచ్చే నెల నుంచే అందిస్తామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఏపీ వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఫైరయ్యారు. ఇదే సమయంలో జనసేన కార్యకరలపై కూడా ఆయన సెటైర్స్ వేశారు. పవన్ కు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఎలా ఇచ్చిందో తెలియదన్న మంత్రి… అది టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రిపోర్ట్ కావొచ్చని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో పవన్ అజ్ణానంతో, ఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడిన ఆయన… రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా దానితో జనసేనకు చెందిన కార్యకర్తలకు సంబంధం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎవరికి బాధ కలిగితే వారు కేసులు పెడతారని.. తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా… కరోనా వంటి విపత్తు సమయంలో వాలంటీర్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని.. అలాంటివారిపై పవన్ మాత్రం పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.