ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ప్రచారాలు.. ఆసక్తికరంగా కనిపించిన అఫిడవిట్ లు.. అత్యంత రసవత్తరంగా సాగిన వ్యవహారాలు.. అర్ధరాత్రి వరకూ కూడా సాగిన పోలింగ్. వెరసి, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో 78.36% పోలింగ్ నమోదైందని తెలుస్తుంది! ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
అవును.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం జూన్ 4 వరకూ ఎదురుచూడాలి. ఈ సమయంలో భారీ ఎత్తున పోలింగ్ జరిగిందని చెబుతున్న వేళ ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… 2019లో 79.64 శాతం పోలింగ్ నమోదయింది. అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారింది.. దీంతో జగన్ రికార్డ్ స్థాయి విక్టరీ సాధించారు.
ఇదే క్రమంలో… ఇప్పుడు కూడా పోలింగ్ పెద్ద ఎత్తునే జరిగింది కాబట్టి.. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నమోదయ్యి ఉందనే కామెంట్లు పలువురు టీడీపీ నేతల నుంచి వినిపిస్తుండటం గమనార్హం. మరోపక్క… “2024 ఎన్నికలకు సంబంధించి నమోదైన భారీ పోలింగ్ మా ప్రభుత్వంపై సానుకూలత”.. అని వైసీపీ చెబుతుంది.
2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని.. బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఇంత భారీ పోలింగ్ లో కనిపిస్తోందని.. తమకున్న సమాచారం మేరకు మహిళలు, పింఛనుదారులు, గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఓటింగ్ ఇవన్నీ వైసీపీకి సానుకూలాంశాలని.. ఫలితంగా వైసీపీకి అనుకూల ఫలితాలు కన్ ఫాం అని చెబుతున్నారు.
వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం ఓటు బ్యాంకు భారీఎత్తున వైసీపీకి పడిందని చెబుతున్నారు. ఇక బీసీ ఓట్లను టీడీపీ – వైసీపీ కి కాస్త అటు ఇటుగా పడగా.. కాపు సామాజికవర్గంలోని మహిళల ఓట్లు కొన్ని వైసీపీకి పడ్డాయనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే… 110 నుంచి 125 సీట్లలో గెలుపు కన్ ఫాం అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం ఓట్లు పూర్తిగా టీడీపీకి దూరమయ్యారనే చర్చ తెరపైకి రావడానికి గల కారణం కూటమిలో బీజేపీ చేరిక, ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వారు ఇచ్చిన స్టేట్ మెంట్లు అని అంటున్నారు పరిశీలకులు! వెరసి ఇదంతా వైసీపీకి పూర్తి అనుకూలంగా మారినట్లుందని చెబుతున్నారు! ఏది ఏమైనా… సోమవారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే… “మళ్లీ జగనే” అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు!