జనసేనలో చేరేందుకు అంబటి రాయుడు యత్నం.!

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైసీపీలో చేరి, పది రోజులు కూడా పూర్తి కాకుండా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నాడు అంబటి రాయుడు. అయితే, టిక్కెట్టు ఇస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిపి, అంతలోనే వైసీపీ మాట మార్చేసింది. దాంతో, అంబటి రాయుడు గుస్సా అయ్యాడు.

రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించి, దుబాయ్‌లో జరిగే క్రికెట్ లీగ్ ఆడనున్నట్లు ప్రకటించిన అంబటి రాయుడు, అనూహ్యంగా జనసేన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ ముందుగా తీసుకుని, పార్టీ కార్యాలయానికి వెళ్ళిన అంబటి రాయుడు, జనసేనానితో చాలా సేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది.

గుంటూరు నుంచే జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేస్తానని అంబటి రాయుడు, జనసేన అధినేత ముందు ప్రతిపాదన వుంచాడట. వైసీపీ తనను టిక్కెట్టు కోసం పెద్ద మొత్తంలో సొమ్ము అడిగిందని, అది తన వల్ల కాదనీ, అందుకే తాను వైసీపీకి గుడ్ బై చెప్పానని అంబటి, జనసేనానితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, గుంటూరు లోక్ సభ టిక్కెట్టు విషయమై అంబటి రాయుడికి జనసేన అధినేత నుంచి ఎలాంటి హామీ దక్కలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. టీడీపీ – జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న దరిమిలా, టిక్కెట్ల పంపకాలపై ఇరు పార్టీలూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా తొందరపడి చేయడంలేదు.

ఇదిలా వుంటే, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.