వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వాయించి వాయించి వదిలారు. ఇప్పుడు వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ గ్యాప్ లో తాజాగా “బ్రో” సినిమా వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు… పవన్ ని వాయించి వాయించి వదులుతున్నారని అంటున్నారు.
అవును… “బ్రో” సినిమా రిలీజ్ తర్వాత అంబటి రాంబాబు వర్సెస్ జనసేన గా “శ్యాంబాబు” వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ ని కామెంట్ చేస్తూ చిన్న సీన్ ఇరికించడం, దాంతో మంత్రి ఫీలవ్వడం.. ట్వీట్లు, ప్రెస్ మీట్ల యుద్ధం తెలిసిందే.
ఈ సమయంలో అంబటి వ్యవహారం చూస్తుంటే… పవన్ ని ఓ పట్టాన్న వదిలేలా లేరన్న విషయం స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా అంబటి రాంబాబు మరోసారి ట్వీట్లు మొదలు పెట్టారు. ఈసారి పవన్ తోపాటు, నిర్మాతపై కూడా కామెంట్లు పెట్టడం గమనార్హం. అంటే… పవన్ ని నమ్మి సినిమా తీసిన నిర్మాత పరిస్థితి? అన్నట్లుగా అన్నమాట.
తాజగా ట్విట్టర్ లో స్పందించిన అంబటి రాంబాబు… “ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు ! ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !!” అని ట్వీట్ చేశారు. ఇటీవల “బ్రో” సినిమా కలెక్షన్ల వివరాలు అధికారికంగా బయటకొచ్చిన తర్వాత టైమ్ చూసుకుని అంబటి ఈ ట్వీట్ వేయడం గమనార్హం.
కేవలం ఈ సినిమా విషయంలో అంబటి “గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !” అంటూ మొదటిగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మైకులముందుకు వచ్చిన మంత్రి… తన అక్కసు అంతా వెళ్లగక్కారు. పవన్ ది శునకానందం అంటూ కామెంట్ చేశారు.
ఇప్పుడు మరోసారి కలెక్షన్స్ పై కూడా కామెంట్ చేశారు. దీంతో పవన్ బ్రో ని అంబటి రాంబాబు ఇప్పట్లో వదిలేలా లేనట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.