అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి

Amaravathi farmers need alternative solutions
పాలకులను నమ్మి వేల ఎకరాలు ఇచ్చారు.  హామీలతో బ్రతుకులు మారిపోతాయని ఆశపడ్డారు.  బిడ్డల భవిష్యత్తుకు భరోసా దొరికిందని మురిసిపోయారు.  కానీ చివరకు రెండు ప్రధాన రాజకీయ పార్టీల నడుమ జరుగుతున్న రాజకీయ క్రీడలో మోసపోయారు.  పాలకుల పంతానికి నిలువునా బలయ్యారు.  అరిచి గీపెట్టినా సమాధానం దొరికే దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేయబడ్డారు.  ఇది ఒకప్పుడు భూములిచ్చి రాజులు అనిపించుకున్న అమరావతి రైతుల పరిస్థితి.  నెలల తరబడి పోరాటం చేసినా అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా నిలుపుకోలేకపోయారు.  చివరికి సీఎం వైఎస్ జగన్ అనుకున్నట్టే మూడు రాజధానులు రానున్నాయి.  ఈ పరిణామంతో త్యాగాలు చేసిన రైతులు అన్యాయమైపోయామని కుమిలిపోతున్నారు. 
 
 
ప్రభుత్వం మాత్రం అభివృద్ది విక్రేంద్రీకరణ జరగాలంటే మూడు రాజధానులే కరెక్ట్ అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.  కారణాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు మంచివైనా చెడ్డవైనా అమరావతి ప్రజల పూర్తిస్థాయి రాజధాని కల చెదిరిపోయింది.  ఎంతో విలువ కలిగిన భవిష్యత్తు దొరుకుందనుకుంటే ఆ విలువ నెలమట్టానికి దిగిపోయింది.  ఇప్పుడేం చేసినా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చడం అసంభవం.  ఎన్ని పోరాటాలు జరిగినా ఈ నాలుగేళ్లు జగన్ వెనక్కి తగ్గరు.  అలాగని రైతులు పోరాటాన్ని విరమించుకోమని కాదు.  వారి ప్రయత్నం వారిది.  కానీ ఆ ప్రయత్నం రాజధాని కోసం కాకుండా కొంచెం టర్న్ తీసుకుని తమ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తే బాగుంటుంది. 
 
 
వాస్తవానికి రాజధాని ఎక్కడుంటే అక్కడ అభివృద్ది జరిగిపోతుందని అనుకోలేం.  అభివృద్ది జరగాలంటే పాలకుల్లో చిత్తశుద్ది ఉండాలి.  రాజధాని అనే పేరు హోదా లేకుండానే సమగ్ర అభివృద్దిని చూసిన ప్రాంతాలు దేశంలో అనేకం ఉన్నాయి.  అంతెందుకు మన రాష్ట్రంలోనే ఉన్న విశాఖ జిల్లా.  పేరుకు విసిరేసినట్టు ఒక మూలన ఉంటుందనే కానీ రాష్ట్రానికి నిజకైన ఆర్థిక రాజధాని ఆ జిల్లానే.  సహజ ఓడరేవులు, అన్ని రకాల ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అనేకం విశాఖలో ఉన్నాయి.  ఇవన్నీ ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు.  గతంలోనే ఉన్నవి.  మరి గతంలో వైజాగ్ రాజధానిగా ఉందా అంటే లేదు కదా.  అయినా ఆ జిల్లా పూర్తిస్థాయిలో డెవలప్ అయింది అంటే కారణం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పెట్టుబడులు. 
 
 
నిజానికి ఇప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినంత మాత్రాన అక్కడ కొత్తగా జరిగే అభివృద్ది ఏమీ ఉండదు.  జరగాల్సిందంతా గతంలోనే జరిగిపోయింది.  కాబట్టి అభివృద్ది చెందాలి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే రాజధానే కానక్కర్లేదు.  ఈ వాస్తవాన్నే అమరావతి విషయంలో అమలుచేస్తే రైతులకు న్యాయం చేయవచ్చు.  ఎలాగూ అమరావతికి శాసన రాజధాని అనే హోదా ఉంది.  ప్రభుత్వం చేతిలో రైతులిచ్చిన భూములున్నాయి.  ఇక కావాల్సిందల్లా పాలకుల చిత్తశుద్ది.  మంచి నీటి వసతి, రవాణా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు ప్రఖ్యాత సంస్థలను నెలకొల్పితే చాలు.  ముందుగా ఆ చొరవ తీసుకోవాల్సింది ప్రభుత్వమే.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రీసెర్చ్ సెంటర్లు, ఉత్పాదక కేంద్రాలు, నిర్వాహక సముదాయాలు నెలకొల్పాలి. 
 
 
హైదరాబాద్ నగరానికి బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్, బీఈఎమ్ఎల్, ఇక్రిశాట్ లాంటివి అమరావతిలో రావాలి.  అలాగే వైజాగ్లో స్టీల్ ప్లాంట్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్, ఎన్టీపీసీ, ఫార్మా రంగాలు లాంటివి ఎర్పడాలి.  అప్పుడే అమరావతిలో ఒక నిర్థిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది.  ఇది జరగాలంటే ప్రభుత్వం చల్లని చూపు ఆ ప్రాంతం మీద ఉండాలి.  ఎలాగూ శాసన రాజధాని కదా ఇంకేం అభివృద్ది కావలి అన్నట్టు ఉండకుండా చిత్తశుద్దితో చేస్తేనే అక్కడి రైతులకు న్యాయం జరుగుతుంది.  ఎలాగూ అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ది సంస్థ అంటూ ఒకదాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సంస్థ ద్వారా ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకుని డెవలప్మెంట్  జరిగేలా చూడాలి.  ముందు అక్కడి రైతులకు అభివృద్ది మీద భరోసా కలిగేలా చేసి వారిలోని ఆందోళనను తగ్గించాలి.