ఈనెల 14 నుంచి కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాత్రపై జనసైనికులు భారీ ఆశలే పెట్టుకున్నారు. తమకు బలం ఉందని చెప్పుకుంటున్న ప్రాంతంలో పవన్ యాత్ర చేస్తుండటంపై పార్టీ వర్గాలు కూడా పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. ఈనేపథ్యంలో ఈ జిల్లాల పరిధిలో సెక్షన్ 30 తెరపైకి వచ్చింది.
పవన్ వారాహి యాత్ర కీలకంగా సాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30 అమల్లోకి తీసుకురావడంపై జనసేన విమర్శలకు దిగుతోంది. పవన్ పర్యటనకు ఇబ్బందులు కలిగించేందుకే సెక్షన్ 30ని ప్రయోగిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ యాత్రకు మూడు రోజుల ముందు ఈ తరహా ఆదేశాలు ఇచ్చారంటే ముమ్మాటికీ యాత్రను అడ్డుకునేందుకేనని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ విషయాలపైనా, జనసేన నేతల విమర్శలపైనా తాజాగా పోలీస్ అధికారులు స్పందించారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే ఆంక్షలు విధించామని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. సెక్షన్ 30 యాక్ట్ సాధారణ విధుల్లో భాగమేనని క్లారిటీ ఇస్తున్నారు. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని.. జనసేన నేతలతో కలిసి అమలాపురం డిఎస్పీ పరిశీలించారు. అనంతరం వారాహియాత్ర రూట్ మ్యాప్ ను కూడా పరిశీలించారు. ఇలా అధికారపార్టీ నేతలు ఎంటర్ అవ్వకుండా పోలీసులే స్థానిక జనసేన నేతలతో మాట్లాడటంతో ఆంక్షల వివాదం సద్దుమణిగింది.
కాగా, ఈనెల 14న అన్నవరం దేవస్థానం నుంచి మొదలై భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో… ఈ నెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అమలాపురం అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో… పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.