ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే “యాత్ర – 2” విడుదలైంది. సినిమా థియేటర్లలో వైఎస్సార్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఒకసారి గతంలోకి తీసుకెళ్లిన ఆ సినిమాను వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు ఒకటికి రెండుసార్లు చూస్తున్న పరిస్థితి. దీనికి కొనసాగింపుగా మరోపక్క “వ్యూహం” విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్జీవీ మార్కు టేకింగ్ తో రెడీగా ఉంది. ఈ మధ్యలో “రాజధాని ఫైల్స్” ఎంట్రీ ఇచ్చింది. దీంతో సరికొత్త రచ్చ తెరపైకి వచ్చింది.
“రాజధాని ఫైల్స్” సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుంచీ ఒకవర్గం నుంచీ ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగా… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, వైసీపీ పార్టీకి అప్రతిష్టపాలు చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలిపింది. ఈ సినిమా సర్టిఫికెట్ ను రద్దుచేయాలని కోరింది. దీంతో ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం… ఈ రోజు వరకూ ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని ఆదేశించింది. ఈ రోజు ఈ సినిమా విడుదలపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
దీంతో… అచ్చెన్నాయుడు మైకులముందుకు వచ్చారు. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం వైసీపీ పిరికిపంద చర్య అని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ అని నిందలు వేస్తున్నారు. సినిమా చూస్తే ప్రజలు ఛీకొడుతారని జగన్ భయపడ్డారని చెబుతూ.. ఈ సినిమాలో ఎవరినీ కించపరిచే సన్నివేశాలు లేవని ఆయన కితాబు ఇవ్వడం గమనార్హం.
ఇలా ఒక సినిమాను ఆపాలని ఒక రాజకీయ పార్టీ ప్రయత్నించడాన్ని పిరికిపంద చర్యగా అచ్చెన్నా అభివర్ణించడంతో… ఈ ఇష్యూ లోకేష్ వైపు టర్న్ తీసుకుంది. ఇందులో భాగంగా… “రాజధాని ఫైల్స్” సినిమా ప్రదర్శనను ఆపేయడానికి జగన్ ప్రయత్నిస్తే… రాంగోపాల్ వర్మ నిర్మించిన “వ్యూహం” సినిమాను ఆపేయడానికి ప్రయత్నించింది నారా లోకేష్ కాదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కారణం… “వ్యూహం” సినిమా విడుదలను ఆపేయాలని నారా లోకేష్ కోర్టుకు ఎక్కింది నిజం కాదా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
దీంతో… వ్యూహం విషయంలో నారా లోకేష్ ది కూడా పిరికిబంద చర్యే కదా అనేది పాయింట్. దీంతో… అచ్చెన్నాయుడు వెనకా ముందూ చూడకుండా స్టేట్ మెంట్స్ ఇస్తే… సోషల్ మీడియా యుగంలో నెటిజన్లు వాయించి వదులుతారన్న విషయం మరిచిపోకూడదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజధాని ఫైల్స్ విషయంలో జగన్ ది పిరికిపంద చర్య అయితే… వ్యూహం విషయంలో నారా లోకేష్ ది కూడా పిరికిబంద చర్యే కదా అనేది ఫైనల్ కన్ క్లూజన్ అన్నమాట. దీంతో అచ్చెన్న.. లోకేష్ ని ఇరికించేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు.
కాగా… వ్యూహం సినిమా విడుదల ఆలస్యం అవ్వడంపై నారా లోకేష్ కి డైరెక్టర్ ఆర్జీవీ థాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఆ రోజు అడ్డుకుని ఉండకపోతే ఇపాటికి సినిమా విడుదలయిపోయేది.. జనం మరిచిపోయే అవకాశం కూడా ఉండేది.. ఆయన కోర్టుకి వెళ్లడం వల్ల ఈ నెల 23న విడుదల చేస్తున్నా.. అందుకు లోకేష్ కి థాంక్స్ అంటూ ఒక కిస్ కూడా పెట్టారు! ఏది ఏమైనా… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పొలిటికల్ మూవీస్ హల్ చల్ ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగానే ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.