జనసేన పార్టీకి 65 సీట్లు ఇవ్వక తప్పదేమోనన్న చర్చ తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో జరుగుతోంది. కింది స్థాయిలో ఇరు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా సాగాలంటే, జనసేన పార్టీకి సముచిత గౌరవం తప్పనిసరి.. అనే భావన టీడీపీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళిపోయింది.
నారా లోకేష్ అతి, టీడీపీ అను‘కుల’ మీడియా పైత్యం పక్కన పెడితే, చంద్రబాబుకీ గ్రౌండ్ రియాల్టీ అర్థమయిపోయింది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే, అందులో ఎన్ని సీట్లు గెలుస్తుంది.? అన్నదానిపై చంద్రబాబుకీ ఖచ్చితమైన లెక్కలున్నాయ్.
సగం సీట్లు జనసేన ఓడిపోవచ్చు.. 50 ఇచ్చినా, 60 ఇచ్చినా.! కానీ, ఆ గౌరవప్రదమైన సీట్లు జనసేనకు ఇస్తేనే, జనసేన నుంచి టీడీపీకి ఓటు షేర్ సరిగ్గా సాగుతుందన్నది చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతల అంచనా. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పదో పాతికో సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అస్సలు జరిగే అవకాశం లేదు. దాంతో, చంద్రబాబుకి జనసేన కోరినన్ని సీట్లు ఇవ్వడం తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నమాట.
అంతా బాగానే వుందిగానీ, నారా లోకేష్‌కి ఎలా సర్దిచెప్పాలి.? టీడీపీ అను‘కుల’ మీడియాని ఎలా మేనేజ్ చేయాలి.? వాస్తవానికి, 2019 ఎన్నికల్లో లోకేష్, టీడీపీ అను‘కుల’ మీడియా కారణంగానే టీడీపీ చావు దెబ్బ తినాల్సి వచ్చిందన్నది బహిరంగ రహస్యం. అదే దెబ్బ ఇంకోసారి తగిలితే, చంద్రబాబు కోలుకునే పరిస్థితే వుండదు.
ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా సాగకపోతే, టీడీపీకి ఓ అరవై డెబ్భయ్ సీట్లు వచ్చినా, ఉపయోగం వుండదు. వైసీపీ బొటాబొటి మెజార్టీతో గద్దెక్కినా ఆ తర్వాత టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే.! అందుకే, 65 సీట్ల వరకూ జనసేనకు ఇచ్చేద్దామన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారట. అధికారిక ప్రకటన సంక్రాంతిలోపు వస్తుందా.? తర్వాత వస్తుందా.? అన్నది వేచి చూడాలి.