TG: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పరుష పదాలతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.అయితే ఇలా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటీఆర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.
పదేళ్లు మంత్రిగా పని చేసిన వ్యక్తి లొట్టపీసు కేసు అని మాట్లాడవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ తండ్రి కెసిఆర్ గారు మీకు నేర్పిన సంస్కారం సంస్కృతి అంటూ ప్రశ్నించారు. విదేశాలలో చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అంటూ మండిపడ్డారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు.
గవర్నర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. గవర్నర్ అనుమతి ఆషామాషీగా రాదు. న్యాయకోవిధులతో చర్చించాకే గవర్నర్ అనుమతి ఇస్తారు. అలాంటి కేసు గురించి కేటీఆర్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని కేటీఆర్ చెబుతూనే మరోవైపు ఈ కేసు నుంచి బయటపడటం కోసం పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
ఇందులో నిజంగా తప్పు చేయకపోతే నీ నిర్దోషితత్వం బయటపడుతుంది. ఆ అవకాశం ఉపయోగించుకోకుండా అసహనం కోల్పోయి మాట్లాడటం ఏంటని దుయ్యబట్టారు. ఇక మీరు అధికారం కోల్పోయామని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని పగ, ప్రతీకారాలు, ద్వేషము ఉంటే దానిని బయటపెట్టే విధానం ఇది కాదని తెలిపారు. ఇప్పటికైనా కెసిఆర్ తన భాష తీరు మార్చుకుంటే మంచిది అంటూ జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.