వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా నియమించుకున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 15నాడు ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ వ్యవస్థ ద్వారా నవరత్నాలలోని ప్రతి పథకం ప్రజలకు చేరాలనేది వైఎస్ జగన్ ఆశయం. అందుకే ఒక్కో వాలంటీరుకు 50 ఇళ్లను కేటాయించారు. ఈ 50 ఇళ్లలో సంక్షేమ పథకాలకు అర్హులెవరనేది నిర్ణయించి, వారి వివరాలను ప్రభుత్వానికి అందించి, వారికి సంక్షేమ ఫలాలు అందేలా చూడటం వాలంటీర్ బాద్యత. నిజానికి ఈ ఆలోచన మంచిదే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి. జనం సైతం ఈ వ్యవస్థను మెచ్చుకున్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కూడా లభించింది.
Read More : వైకాపా – టిడిపి ఎత్తుకు పై ఎత్తుల్లో ప్రజలు చిత్తు
ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చాక వెల్ఫేర్ స్కీమ్స్ గతం కంటే సమర్థవంతంగా ప్రజలకు చేరుతున్న మాట వాస్తవం. సమగ్ర సర్వే ద్వారా లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగింది. ప్రజలకు ప్రభుత్వం దగ్గరైంది. ఇవన్నీ నాణానికి ఒకవైపు అయితే వాలంటీర్ ఉద్యోగుల తప్పిదాలు, వ్యవస్థలోని లోపాలు ప్రభుత్వ ప్రధాన లక్ష్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. యువతకు ఉపాది కల్పించి పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంలో ప్రభుత్వం హడావుడిగా వాలంటీర్ల నియామకం చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో యువత పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందినవారు కొందరైతే సిఫార్సుల ద్వారా పొందినవారు కొందరు. వైకాపా కార్యకర్తలకే ఎక్కువ శాతం ఉద్యోగాలు వెళ్లాయనే ఆరోపణలు వచ్చాయి. ఎలాగోలా మొత్తానికి నియామకం పూర్తైంది.
ఇక రియల్ గ్రౌండ్లోకి వాలంటీర్లు దిగేసరికి సమస్యలు మొదలయ్యాయి. విధుల నిర్వహణలో చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాంకేతిక సమస్యలను శిక్షణ ద్వారా అధిగమించవచ్చు. కానీ కొందరు వాలంటీర్లలో క్రమశిక్షణ లోపించడం పెద్ద ఇబ్బందులనే తెచ్చి పెట్టింది. కొందరు వాలంటీర్లు నేరాలకు పాల్పడ్డ సంఘటనలు అనేకం జరిగాయి. కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీలో ఒక వాలంటీర్ పెట్టే వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆ వాలంటీరును విధుల నుండి తొలగించారు. నెల్లూరులో అయితే మహిళా వాలంటీర్ తనపై పిర్యాధు చేసిందనే కోపంతో ఒక మహిళను రౌడీలను పెట్టి కొట్టించింది.
క్రిష్ణా జిల్లాలో అయితే ఒక వాలంటీర్ లాక్ డౌన్ సమయంలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల క్రితం అనంతపురంలో ఒక వాలంటీర్ 49 మంది వృద్దులు, వికలాంగులకు ఇవ్వాల్సిన 63,000 రూపాయల నగదుతో పరారయ్యాడు. తాజాగా తిరుపతిలోని పుంగనూరు మండలంలో ఒక వాలంటీర్ పింఛన్ ఇవ్వడానికని ఇంటికి వెళ్లి మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. ఇక ఈరోజు తాడిపత్రిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఒక వాలంటీరుకు అక్కడి స్థానికులు దేహశుద్ది చేశారు. రెండు వారాల క్రితం క్రిష్ణా జిల్లాలో ఒక వాలంటీర్ తనను గర్భవతిని చేసి మోసం చేశాడని ఒక యువతి పిర్యాధు చేసింది.
చాలా చోట్ల తెలుగు దేశం కార్యకర్తలు తమ పట్ల వాలంటీర్లు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కేవలం క్రమశిక్షణా రాహిత్యం వలన జరుగుతున్న తప్పిదాలే. వీటి మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు దాపురిస్తోంది. వాలంటీర్లంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉండి పనిచేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల దైనందిన జీవితంలో వారూ ఒక భాగమే. అలాంటి వారికి ప్రజలతో ఎంత మర్యాదగా మెలగాలి, ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయడం, పరిధిలు దాటకుండా బాద్యతలను చక్కబెట్టడం వంటి ముఖ్యమైన విషయాల్లో పూర్తి అవగాహన, పరిణితి ఉండాలి. వాటిని కల్పించాల్సిన బాద్యత వారిని నియమించిన ప్రభుత్వానిదే.
కానీ ప్రభుత్వం నియామకంతోనే చేతులు దులుపుకోవడంతో ఈ అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి మూలంగా కరోనా కాలంలో ప్రాణాలకి రిస్క్ అని తెలిసీ ఇంటింటికీ తిరిగి రేషన్, పింఛన్ పంపిణీ చేస్తున్న నిజాయితీపరులైన వాలంటీర్లకు, కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రజల కోసం ఈ వ్యవస్థను నడుపుతున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు వాటిల్లుతోంది.ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కనుక ఇకనైనా సర్కార్ వాలంటీర్లకు అవగాహన, క్రమశిక్షణా సదస్సులను అవలంభించి వ్యవస్థలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం చాలా ఉంది.