ఉత్తరాంధ్రను ఎవరు కబ్జా చేస్తారో…?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉత్తరాంధ్ర చుట్టు తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతల చూపు ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. దీంతో 2019 ఎన్నికల్లో పార్టీల భవిష్యత్ ఉత్తరాంధ్రనే నిర్ణయిస్తుందా అన్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ తన కార్యక్రమాలన్ని దాదాపు ఉత్తరాంధ్ర నుంచే చేశారు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యను తీసుకొని ఆయన పెద్ద ఉద్యమమే చేశారు.

ఇతర పార్టీలన్ని కూడా ఉత్తరాంధ్రను కేంద్రంగా తీసుకొని తమ కార్యక్రమాలను చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కూడా విశాఖను కేంద్రంగా చేసుకుని అనేక ఉద్యమాలను చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ కోసం విశాఖ వేదికగానే వైసిపి ఎంపీలు ఉద్యమించారు. ఉత్తరాంధ్రలో టిడిపి క్యాడర్ బలంగా ఉంది. టిడిపికి 2014 ఎన్నికల్లో వైసిపి గట్టి పోటినే ఇచ్చింది. వాస్తవానికి పవన్ శ్రీకాకుళం ఉద్దాన సమస్యను సీరియస్ గా తీసుకున్నప్పటి నుంచే ఉత్తరాంధ్ర హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆయన ఎక్కువగా ఉత్తరాంధ్ర మీదే దృష్టి పెట్టారు. శ్రీకాకుళంలోని ఏజెన్సీలలో పర్యటిస్తూ వారి సమస్యలపై పోరాడుతూ అక్కడి ప్రాంత సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించారనే చెప్పవచ్చు . అలాగే ఇక్కడి ప్రాంతాలలో సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. విశాఖ పట్టణం అభివృద్దిగా కనిపించినా దాని చుట్టూ ఉన్న ఏజెన్సి ప్రాంత ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా లేదు. అలాగే రోడ్లు లేక వారు అడవుల వెంటే నడుస్తూ తమ ప్రయాణాలు సాగిస్తారు. ఇటువంటి సమస్యలన్నీ రాజకీయ పార్టీలకు ప్లస్ గా మారాయి. దీంతో ఈ వేదిక నుంచే నేతలు ఉద్యమిస్తున్నారు.

కేంద్రం ఇస్తానన్న రైల్యేజోన్ ఇవ్వకపోవటంతో విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో అనేక ఉద్యమాలే నడిచాయి. ప్రస్తుతం పార్టీలన్నీ పూర్తిగా ఉత్తరాంధ్ర మీద దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పవన్ ఉత్తరాంధ్రాను చుట్టేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే కోల్పోయింది. ఎలాగైనా ఏపీలో ఎక్కువ సీట్లు హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ ఉత్తరాంధ్ర పర్యటనకు మూడు రోజుల షెడ్యూల్ ఖరారు చేసుకున్నాడు. అలాగే బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటించాడు. వామపక్షాల నేతలు కూడా విశాఖ వేదికలుగా ఉద్యమిస్తున్నారు. వామపక్షాలు పవన్ తో కలిసి ఆయన చేసే ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నాయి. అధికార టిడిపి కూడా విశాఖ కేంద్రంగా ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ధర్మపోరాట దీక్షలు, సభలు నిర్వహించింది. ఉత్తరాంధ్రలో టిడిపికి బలమైన నాయకత్వం ఉంది. అయినా ప్రతిపక్షాలన్ని విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు చేస్తుండటంతో తమ బలం కోల్పోకుండా టిడిపి కూడా రంగంలోకి దిగింది. 2014లో వైసిపి గట్టిపోటి ఇచ్చి అరకు ఎంపీ స్థానంతో పాటు, మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగింది.

టిడిపి క్యాడర్ బలంగా ఉన్న 2004, 2009 ఎన్నికల నుంచి ఉత్తరాంధ్రలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. 2004 లో వైఎస్ బలంతో టిడిపి ఎక్కువ స్థానాలు గెలుచుకోలేక పోయింది. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం ఐదు స్ధానాలు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో వైసిపి అరకు పార్లమెంట్ తో పాటు మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. దీంతో బలమైన టిడిపికి కలవరం మొదలైంది. ఇక్కడి నుంచే అన్ని పార్టీలు ఉద్యమించటానికి కారణం ఇక్కడ సమస్యలు ఎక్కువగా ఉండటం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రజలకు మాట ఇచ్చేందుకు అనుకూల ప్రాంతంగా పార్టీలకు ఉత్తరాంధ్ర కీలకమైంది. రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు వంటివి ప్రధానంగా ఉన్న సమస్యలు. దీంతో పార్టీలన్నీ ఈ నినాదం ఎత్తుకునే ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ సమస్యల సాకుతోనే పార్టీలన్నీ ఉత్తరాంధ్రపై చూపేసాయనే చర్చ జరుగుతుంది.

అన్ని పార్టీల దృష్టి పడిన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పుడు రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. 2019 ఎన్నికల్లో చక్రం తిప్పే ప్రాంతంగా మారిపోయింది. దీంతో రాజకీయాలను వేడెక్కిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల ఆదరణ ఎవరికో చూడాలి మరీ .